IND vs SA: దంచికొట్టిన బ్యాటర్లు.. టీమ్‌ఇండియా ఘన విజయం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమ్‌ఇండియా విజృంభించి ఘన విజయం సాధించింది. శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌, మహ్మద్‌ సిరాజ్‌ రాణించారు.

Updated : 09 Oct 2022 21:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 279 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (113*) సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్‌ (13),  శుభ్‌మన్ గిల్ (28) స్వల్ప స్కోర్లకే ఔటైనప్పటికీ.. శ్రేయస్‌ అయ్యర్‌-ఇషాన్‌ కిషన్‌ జోడీ అద్భుతంగా రాణించింది. నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ ఈ ఇద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆపై కుదురుకున్నాక చెలరేగిపోయారు. ముఖ్యంగా ఇషాన్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్‌ కిషన్‌ 93 పరుగుల వద్ద ఔటై సెంచరీ మిస్సయినప్పటికీ.. అయ్యర్‌ (113*) శతకం బాదాడు. శాంసన్‌తో (30*) జట్టుకట్టి టీమ్‌ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. శ్రేయస్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

అంతకుముందు సఫారీ జట్టు బ్యాటర్లు ఐదెన్ మార్‌క్రమ్‌ (79), రీజా హెండ్రిక్స్‌ (74) రాణించి భారత్‌ ముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచారు. ఈ ఇద్దరి దూకుడు చూస్తే ఆ జట్టు 300లకు పైగా స్కోరు చేస్తుందని అందరూ భావించారు. అయితే, బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు స్పల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి 278 స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లతో రాణించాడు. సుందర్‌, షహబాజ్, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్‌కు తలో వికెట్‌ దక్కింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఈనెల 11న (మంగళవారం) జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని