IND vs NZ : కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ రికార్డును సమం చేసిన అశ్విన్‌

కివీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పూర్తి పట్టు సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన...

Published : 06 Dec 2021 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కివీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పూర్తి పట్టు సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 540 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఇంకా 400 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో భారత బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు వికెట్లను పడగొట్టాడు. దీంతో అశ్విన్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్-కివీస్‌ ద్వైపాక్షిక టెస్టు సిరీసుల్లో మాజీ ఆల్‌రౌండర్‌ సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ రికార్డును అశ్విన్‌ సమం చేశాడు. ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడిన టెస్టుల్లో హ్యాడ్లీ 24 ఇన్నింగ్స్‌ల్లో 65 వికెట్లను పడగొట్టగా.. రవిచంద్రన్‌ మాత్రం కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం. 

అంతేకాకుండా ఈ సంవత్సరం టెస్టుల్లో 50 వికెట్లను తీసిన మొదటి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డుకెక్కాడు. అశ్విన్‌ తర్వాత పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్లు షహీన్‌ అఫ్రిది (44), హసన్‌ అలీ (39) ఉన్నారు. కివీస్‌తో చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ అశ్విన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 62 పరుగులకే కివీస్‌ కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌ను 276/7 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. మరో రెండు రోజులు మిగిలిన ఉన్న క్రమంలో టీమ్‌ఇండియా విజయం ఖాయమే. ఇదే మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో పది, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను తీసిన కివీస్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్ (14/225) కూడా హ్యాడ్లీ (9/52) రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని