Rohit Sharma: వన్డేల్లో రోహిత్‌.. మూడంకెల కోసం మూడేళ్ల నిరీక్షణకు తెర!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు వన్డేల్లో మూడేళ్ల తర్వాత సెంచరీ బాదేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో (IND vs NZ) శతకం పూర్తి చేశాడు. మరోవైపు గిల్‌ కూడా సెంచరీ నమోదు చేశాడు.

Updated : 24 Jan 2023 15:52 IST

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సెంచరీలతో మోతమోగించారు. మూడేళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (101) వన్డేల్లో శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 83 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను తాకాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా 2020 జనవరి 19వ తేదీన ఆస్ట్రేలియా మీద చివరిసారిగా రోహిత్‌ మూడంకెల స్కోరును నమోదు చేశాడు. ఇప్పుడు సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, 9 ఫోర్లు ఉన్నాయి.  వన్డే కెరీర్‌లో రోహిత్‌కిది 30వ శతకం. సెంచరీ సాధించిన వెంటనే ఔటై పెవిలియన్‌కు చేరాడు.  

మరోవైపు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (112) కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన గిల్‌.. మూడో వన్డేలోనూ సెంచరీ పూర్తి చేశాడు. గిల్‌ కేవలం 72 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో శతకం బాదడం విశేషం. ప్రస్తుతం 28 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఇందులో  కేవలం బౌండరీల ద్వారానే 156 పరుగులు రావడం గమనార్హం. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, ఇషాన్‌ కిషన్ ఉన్నారు. 

మరికొన్ని విశేషాలు..

* వన్డేల్లో అత్యధిక సెంచరీల సాధించిన బ్యాటర్లలో రోహిత్‌ ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (30)తో కలిసి సమంగా మూడో స్థానంలో నిలిచాడు. 

* మరో ఓపెనర్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు  212 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్‌పై తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

* తక్కువ ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వన్డే శతకాలు బాదిన ఐదో క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్. భారత్‌ నుంచి తొలి ఆటగాడు. 21 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు సెంచరీలు బాదాడు. పాక్‌ బ్యాటర్ ఇమామ్‌ ఉల్ హక్‌ కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించాడు.

* ద్వైపాక్షిక సిరీసుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గానూ గిల్ రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులు సాధించాడు. అంతర్జాతీయంగా బాబర్‌ అజామ్ (360)తో సమంగా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని