Rohit Sharma : విండీస్‌తో మూడో టీ20.. గాయంపై స్పందించిన రోహిత్ శర్మ

 విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ముందంజ వేసింది. మూడో టీ20లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా...

Published : 03 Aug 2022 10:56 IST

ఇంటర్నెట్ డెస్క్: విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ముందంజ వేసింది. మూడో టీ20లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్ (76), శ్రేయస్‌ అయ్యర్ (27), రిషభ్ పంత్ (33*) రాణించారు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (5 బంతుల్లో 11 రిటైర్‌హర్ట్‌: ఒక సిక్స్‌, ఒక ఫోర్‌) దూకుడుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా నడుం వద్ద కండరాలు పట్టేయడంతో మైదానం వదిలి పెట్టాల్సి వచ్చింది. నాలుగో టీ20 నాటికే అందుబాటులోకి వస్తాడా..? లేదా..? అనే అనుమానాలు రేకెత్తడంతో.. రోహిత్ స్పందించాడు. గాయం నుంచి కోలుకుని  వచ్చే మ్యాచ్‌ ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. 

మ్యాచ్‌ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడైతే బాగానే ఉంది. తదుపరి మ్యాచ్‌కు(ఆగస్ట్‌ 6) ఇంకా సమయం ఉంది.. కాబట్టి ఆలోపు గాయం నుంచి కోలుకుంటానని భావిస్తున్నా. ఇక ఇవాళ్టి మ్యాచ్‌ గెలవడం సంతోషంగా ఉంది. కీలకమైన మధ్య ఓవర్లలో బౌలింగ్‌ చేయడం ఎప్పుడూ సవాలే. అయితే పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని మా బౌలర్లు విభిన్నంగా బౌలింగ్‌ వేశారు. ఛేదనలోనూ సానుకూల దృక్పథంతో ఆడాం. ఎక్కడా రిస్క్‌ తీసుకున్నట్లు నాకైతే అనిపించలేదు. చాలా ప్రశాంతంగా బ్యాటర్లు ఛేదన చేశారు. సూర్య అద్భుతంగా ఆడాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాడు. ఇక్కడ టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేం కాదు. అందుకే.. ఎలాంటి రిస్క్‌కు పోకుండా పరుగులు రాబట్టాం’’ అని రోహిత్ వివరించాడు. రోహిత్ గాయంపై బీసీసీఐ ట్విటర్‌లో స్పందించింది. ‘రోహిత్‌కు నడుం కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తోంది’’ అని ట్వీట్ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని