French Open: నాదల్‌పై జకోవిచ్‌ విజయం..

ఫ్రెంచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ సెమీ ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫేల్‌ నాదల్‌పై నొవాక్‌ జకోవిచ్‌ అద్భుత విజయం సాధించాడు. శుక్రవారం అర్ధరాత్రి హోరాహోరీగా నాలుగు గంటలకు పైగా సాగిన ఈ రసవత్తర పోరులో...

Published : 12 Jun 2021 11:51 IST

(Photo: Novak Djokovic Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ సెమీ ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫేల్‌ నాదల్‌పై నొవాక్‌ జకోవిచ్‌ అద్భుత విజయం సాధించాడు. శుక్రవారం అర్ధరాత్రి హోరాహోరీగా నాలుగు గంటలకు పైగా సాగిన ఈ రసవత్తర పోరులో జకోవిచ్‌ 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో విజయం సాధించాడు. దీంతో అతడు ఫైనల్లో గ్రీస్‌కు చెందిన ఐదో సీడ్‌ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. ఇక గతరాత్రి ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఈ రసవత్తర పోరు అటు టెన్నిస్‌ అభిమానులనే కాకుండా ఇటు టీమ్‌ఇండియా క్రికెటర్లను సైతం ఎంతగానో అలరించింది. నువ్వా నేనా అనే రీతిలో వాళ్లిద్దరూ పోటీపడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ ఆటను వీక్షించారు.

క్రీడల్లో పట్టు వదలక పోరాడటం అంటే ఏంటో తెలియాలంటే ఈ మ్యాచ్‌ను చూడాలని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ట్వీట్‌ చేశాడు. ఎవరైనా భారతీయులు రాత్రి ఈ మ్యాచ్‌ చూడకపోతే కనీసం రీప్లే అయినా చూడాలని కోరాడు. ఇలాంటి పోరు హైలైట్స్‌లో చూడటం కూడా సరిపోదని వ్యాఖ్యానించాడు. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ఇది కేవలం టెన్నిస్‌ కాదని, ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల మధ్య జరిగిన అత్యున్నత ప్రదర్శన అని కొనియాడాడు. మరోవైపు వసీమ్‌ జాఫర్‌ సైతం ఈ మ్యాచ్‌పై తనదైన హాస్యం జోడించాడు. నాదల్‌ ఓడిపోవడం జోక్‌ అని పేర్కొంటూనే.. జకోవిచ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడంటూ ట్వీట్‌ చేశాడు. కాగా, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గత 14 సెమీ ఫైనల్స్‌లో నాదల్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. మరోవైపు జకో ఫైనల్లో గెలిస్తే అతడికిది 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని