Team India - T20 World Cup: సూపర్-8.. భారత్‌కు ‘గండం’ ఆ ఒక్కటే..!

భారత్‌ తలపడే సూపర్-8 పోరులో ఆసీస్‌, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ ప్రత్యర్థి జట్లు. ఒక్కటి ఓడినా.. సెమీస్‌ అవకాశాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదు.

Published : 18 Jun 2024 09:12 IST

టీ20 ప్రపంచ కప్‌.. ఇప్పటి వరకు 20 టీమ్‌లు లీగ్‌ స్టేజ్‌లో తలపడ్డాయి. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌ల్లోనూ టాప్ బ్యాటర్లకు చెమటలు పట్టాయి. ఇక నుంచి ఎనిమిది జట్లతో కూడిన ‘సూపర్-8’ సమరం మొదలు కానుంది. టీమ్‌ఇండియా పోరాటం గురువారం నుంచి ప్రారంభమవుతుంది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.  ఇందులో రెండు జట్లను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికే పెద్ద జట్లకు షాక్‌లు తగిలిన సంగతిని మరువకూడదు.

తొలి మ్యాచ్‌ అఫ్గాన్‌తో..

సంచలనాలకు మారుపేరు అఫ్గానిస్థాన్‌. తనదైన రోజున ఎంతటి పెద్ద జట్టుకైనా షాక్‌ ఇవ్వగలదు. అందుకు ఉదాహరణ లీగ్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌పై 84 పరుగుల తేడాతో విజయం సాధించడం. టీ20 క్రికెట్‌లో ఇదొక భారీ గెలుపు అని చెప్పొచ్చు. గ్రూప్-Cలో వెస్టిండీస్, న్యూజిలాండ్‌ వంటి బలమైన జట్లతోపాటు కొత్తగా వచ్చిన ఉగాండా, పాపువా న్యూగినీతో అఫ్గాన్‌ తలపడింది. ఇక్కడ నుంచి కివీస్‌ సూపర్-8కి వస్తుందని మాజీలు కూడా అంచనా వేశారు. తీరా కివీస్‌కు షాక్‌ ఇచ్చిన అఫ్గాన్‌.. మిగతా చిన్న టీమ్‌లపై విజయం సాధించి సూపర్-8కి అర్హత సాధించింది. విండీస్‌ చేతిలో మాత్రమే ఓడింది. అఫ్గాన్‌ కెప్టెన్ రషీద్‌ ఖాన్‌, గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, నబీ, నూర్ అహ్మద్, ఫరూఖి, నవీనుల్‌ హక్ అత్యంత ప్రమాదకర క్రికెటర్లు. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తమవైపు తిప్పేయగల సమర్థులు. వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో గుర్బాజ్ (167 పరుగులు) ముందున్నాడు. బౌలర్ల విషయంలోనూ ఫరూఖి (12) టాప్‌ వికెట్‌ టేకర్ కావడం గమనార్హం. ఇలాంటి జట్టుతో భారత్‌ జూన్ 20న బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 

బంగ్లాతోనూ జాగ్రత్త..!

గ్రూప్-D నుంచి రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌కు లీగ్‌ స్టేజ్‌లో పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. దక్షిణాఫ్రికా చేతిలోనే ఓటమిపాలైంది. శ్రీలంక, నెదర్లాండ్స్‌, నేపాల్‌ను ఓడించి సూపర్‌-8కి అర్హత సాధించింది. మాజీ కెప్టెన్ షకిబ్ అల్‌ హసన్ మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. దక్షిణాఫ్రికాను కూడా చివరి వరకూ వణికించిన బంగ్లా రెండో దశలో మరింత చెలరేగుతుందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా భారత్‌తో ఆడేటప్పుడు ఆ జట్టంతా చివరి వరకూ పోరాడటం గతంలోనూ మనం చూశాం.  షకిబ్‌తోపాటు కెప్టెన్ షాంటో, తన్జిద్‌, మహ్మదుల్లాను అడ్డుకుంటే సగం గెలిచినట్లే. ఇక బౌలింగ్‌లో ముస్తాఫిజర్‌ కీలకం. అతడికి భారత బ్యాటర్ల ఆటతీరుపై ఓ అవగాహన ఉంది. రిషద్, తస్కిన్ కూడా ప్రమాదకరమే. బంగ్లాదేశ్‌తో సూపర్‌-8లో భారత్ జూన్ 22న ఆంటిగ్వా వేదికగా ఆడనుంది.

ఆస్ట్రేలియాతోనే సవాల్‌!

గ్రూప్‌-Bలో నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకొనేందుకు దూసుకొచ్చింది. లీగ్‌ స్టేజ్‌లో కఠినమైన ప్రత్యర్థిగా భావించిన ఇంగ్లాండ్‌పైనా ఘనవిజయం సాధించింది. మిగతావన్నీ చిన్న జట్లే. నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌ను అలవోకగా ఓడించింది. తొలి దశలో ఆసీస్‌ ఆట సాధారణంగా ఉంటుంది. నాకౌట్‌ స్టేజ్‌ నాటికి ప్రత్యర్థులను వణికిస్తుంది. గత వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్‌కు చేరుకొనేందుకు కష్టాలుపడిన ఆసీస్‌.. చివరికి టైటిల్‌ను నెగ్గిందంటే అసాధారణ పోరాట పటిమ వల్లే. ఇప్పుడు ఓపెనర్లు వార్నర్, ట్రావిస్ హెడ్ మంచి ఆరంభాలను ఇస్తున్నారు. ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ మార్కస్ స్టాయినిస్ చెలరేగుతున్నాడు. బౌలింగ్‌లో స్టార్క్, ఆడమ్ జంపా ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నారు. ఆ జట్టు బౌలింగ్‌ ఎంత బలంగా ఉందంటే పాట్ కమిన్స్‌ను కూడా బెంచ్‌కే పరిమితం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆసీస్‌తో భారత్ జూన్ 24న సెయింట్‌ లూసియా వేదికగా తలపడనుంది.

అన్నీ గెలిస్తే.. నో టెన్షన్

సూపర్‌-8లో భారత్‌ ప్రత్యర్థులు అఫ్గాన్‌, బంగ్లా, ఆసీస్‌. మూడు మ్యాచుల్లోనూ భారత్‌ గెలిస్తే.. సెమీస్‌కు చేరుకొనేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే మాత్రం నెట్‌రన్‌రేట్‌ కీలకం అవుతుంది. భారత్‌కు అఫ్గాన్, బంగ్లా నుంచి ప్రతిఘటన ఎదురైనా.. విజయం సాధించే అవకాశాలు ఎక్కువే. మొదటి రెండు మ్యాచ్‌లు ఇవే జట్లతో ఉండటం కూడా మనకు కలిసొచ్చే అంశమే. ఈ గ్రూప్‌లో మనకు కఠిన ప్రత్యర్థి ఆసీస్‌. ఒకవేళ తొలి రెండు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా.. మనకు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లా మారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వరుస విజయాలను ఖాతాలో వేసుకోవాల్సిందే.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని