టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 336 ఆలౌట్‌ 

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(62; 144 బంతుల్లో 7x4, 1x6), శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6)...

Updated : 17 Jan 2021 15:53 IST

అర్ధశతకాలతో ఆదుకున్న శార్దూల్‌, వాషింగ్టన్‌

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 21/0

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(62; 144 బంతుల్లో 7x4, 1x6), శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకాలతో రాణించారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెద్ద స్కోర్లు చేయకపోయినా వీరిద్దరూ పట్టుదలతో ఆడారు. ఈ క్రమంలోనే గబ్బా మైదానంలో టీమ్‌ఇండియా తరఫున ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఆధిక్యం 33కే పరిమితమైంది. కంగారూ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 5 వికెట్లు తీయగా, స్టార్క్‌ 2, కమిన్స్‌ 2, లైయన్‌ ఒక వికెట్‌ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 21 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(20), మార్కస్‌ హారిస్‌(1) క్రీజులో ఉన్నారు.

కుదురుకున్నట్లే కనిపించినా..
అంతకుముందు 62/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆదివారం మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా తొలి సెషన్‌లో మరో 99 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్‌ 105 వద్ద పుజారా(25) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై రహానె(37), మయాంక్‌ (38) నిలకడగా ఆడినా భోజన విరామం ముందు భారత్‌ నాలుగో వికెట్‌ నష్టపోయింది. స్టార్క్‌ బౌలింగ్‌లో రహానె వేడ్‌ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 144/4గా నమోదైంది. ఆపై మయాంక్‌ అగర్వాల్‌, పంత్‌ జాగ్రత్తగా ఆడడంతో భారత్‌ తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి 161/4తో నిలిచింది.

శార్దుల్‌, సుందర్‌ లేకుంటే..
ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన తొలి ఓవర్‌లోనే మయాంక్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ చేతికి చిక్కాడు. కాసేపటికే పంత్‌ కూడా గ్రీన్‌ చేతికి చిక్కడంతో భారత్‌ 186/6 స్కోర్‌తో కష్టాల్లో పడింది. ఇక మిగిలింది టెయిలెండర్లే కావడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించేలా కనిపించింది. అయితే.. శార్దూల్‌, సుందర్‌ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా రెండో సెషన్‌ను పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్‌ 253/6కి చేరింది. ఈ క్రమంలోనే టీ విరామం తర్వాత మరింత రెచ్చిపోయిన శార్దూల్‌, సుందర్‌ ఆస్ట్రేలియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ అర్ధశతకాలతో ఏడో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు. చివరికి జట్టు స్కోర్‌ 309 పరుగుల వద్ద కమిన్స్‌.. శార్దూల్‌ను బౌల్డ్‌ చేయడంతో ఆసీస్‌ ఊపిరి పీల్చుకుంది. తర్వాత సైని(5), సుందర్(62)‌, సిరాజ్‌(13) త్వరగానే ఔటయ్యారు. దాంతో టీమ్‌ఇండియా 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది.

ఇవీ చదవండి..
మరో 6 పరుగులు చేసుంటే.. 
శార్దూల్‌, సుందర్‌ రికార్డు భాగస్వామ్యం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని