Team India: భారత క్రికెటర్లు జిమ్‌ కోసం మెంబర్‌షిప్‌ తీసుకోవాల్సి వచ్చిందా? వసతులపై మళ్లీ చర్చ!

యూఎస్‌ఏ క్రికెట్ సంఘం, ఐసీసీపై మరోసారి వసతుల విషయంలో విమర్శలు వస్తున్నాయి. కనీసం జిమ్‌ చేసుకొనేందుకూ సరైన సదుపాయాలను కల్పించలేదని తెలుస్తోంది.

Published : 12 Jun 2024 13:39 IST

(ఫొటో సోర్స్‌: ఇన్‌స్టాగ్రామ్‌)

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) మెగా టోర్నీకి విండీస్‌తో కలిసి అమెరికా తొలిసారి ఆతిథ్యం ఇచ్చింది. అయితే, అక్కడి ‘డ్రాప్‌ ఇన్‌’ పిచ్‌లతో వార్తల్లో నిలిచిన యూఎస్‌ఏ.. ఆటగాళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలోనూ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారత ఆటగాళ్లు న్యూయార్క్‌లోనే వార్మప్‌తోపాటు రెండు మ్యాచ్‌లను ఆడారు. ఇవాళ మరొక మ్యాచ్‌లో యూఎస్‌ఏతో తలపడనుంది. బయటి పార్కుల్లోనే ప్రాక్టీస్‌ చేయాల్సి వచ్చిందని ఏకంగా భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడే కాస్త అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా సదుపాయాలకు సంబంధించి మరొక విషయం బయటకొచ్చింది. 

న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు జిమ్ చేసుకోవడానికి కూడా అక్కడ సరైన ఎక్విప్‌మెంట్‌ లేదు. దీంతో బయట ఉన్న జిమ్‌లో మెంబర్‌షిప్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఇదే విషయం పలు వార్తల్లో చక్కర్లు కొట్టింది. ‘‘హోటల్‌లోని జిమ్‌ను ఆటగాళ్లు వాడుకోలేదు. అక్కడ సరైన సదుపాయాలు లేవనేది వారి భావన. దీంతో దగ్గరలోని ఓ జిమ్‌లో మెంబర్‌షిప్‌ తీసుకోవాల్సి వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా జిమ్‌ చైన్‌ కలిగిన సంస్థ. ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకున్నారు’’ అని క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. 

అమెరికాలో క్రికెట్‌కు ఎక్కువగా ఆదరణ ఉండదు. ఇప్పుడిప్పుడే ఈ క్రీడ విస్తరణ కోసం ఐసీసీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టీ20 వరల్డ్‌ కప్ కోసం సహ ఆతిథ్య బాధ్యతలను అప్పగించింది. అయితే, సరైన సౌకర్యాలు మాత్రం కల్పించలేకపోతుందనే విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ జట్టూ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరోవైపు యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టు కూడా మెరుగైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటోంది. పాకిస్థాన్‌ను ఓడించి సత్తా చాటింది. ‘సూపర్ - 8’ రేసులో నిలిచింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు