మూడో టెస్టుకు ఉమేశ్‌ ఔట్‌.. శార్దుల్‌ ఇన్‌!

ఆస్ట్రేలియాతో జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్ స్థానంలో శార్దుల్‌ ఠాకుర్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు...

Updated : 31 Dec 2020 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్ స్థానంలో శార్దుల్‌ ఠాకుర్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండో టెస్టులో ఉమేశ్‌కు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతడు మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో భారత్‌కు తిరిగి వెళ్లి ఎన్‌సీఏలో చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు. 

అయితే, ఉమేశ్‌ స్థానంలో ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆకట్టుకున్న నటరాజన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నా.. టీమ్‌ఇండియా శార్దుల్‌ పట్ల సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ఎందుకంటే నటరాజన్‌ తమిళనాడు తరఫున ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడని, శార్దుల్‌ ముంబయి తరఫున 62 మ్యాచ్‌లు ఆడి 206 వికెట్లు తీశాడని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ఇంతకుముందే అతడు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా గాయం కారణంగా అరంగేట్రం చేయలేకపోయిన సంగతి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నటరాజన్‌కు బదులు శార్దుల్‌ను ఎంపిక చేసే వీలుందని వివరించారు. 

శార్దుల్‌ ఠాకుర్‌ బ్యాటింగ్‌లోనూ రాణించగలడని, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 6 అర్ధశతకాలు కూడా చేశాడని సదరు అధికారి పేర్కొన్నారు. దీంతో నటరాజన్‌ను కాదని, అతడిని ఎంపిక చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా టీమ్‌ఇండియా సిడ్నీ చేరుకున్నాకే శార్దుల్‌ను మూడో టెస్టుకు ఎంపిక చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారని తెలిపారు. ఈ విషయంలో హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, తాత్కాలిక కెప్టెన్ రహానె, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇదిలా ఉండగా.. భారత్‌ మెల్‌బోర్న్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మిగతా రెండు టెస్టుల్లోనూ విజయం సాధిస్తే రహానె చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. 

ఇవీ చదవండి..

డేవిడ్ వార్నర్‌ ‘మహర్షి’ టీజర్‌ చూశారా? 

వార్నర్‌ దశావతారం..హార్దిక్‌ హ్యాపీ హ్యాపీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని