T20 World Cup: సెమీస్‌ దారిలో...

గ్రూప్‌-1 నుంచి వరుసగా రెండు విజయాలతో భారత్‌ సెమీస్‌ చేరడం దాదాపుగా ఖాయమే! ఆదివారం అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే ఈ గ్రూప్‌లో సెమీస్‌ రేసు ముగిసినట్లే.

Published : 23 Jun 2024 01:48 IST

గ్రూప్‌-1 నుంచి వరుసగా రెండు విజయాలతో భారత్‌ సెమీస్‌ చేరడం దాదాపుగా ఖాయమే! ఆదివారం అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే ఈ గ్రూప్‌లో సెమీస్‌ రేసు ముగిసినట్లే. రెండు విజయాలతో మెరుగైన స్థితిలో ఉన్న టీమ్‌ఇండియాతో పాటు ఆసీస్‌ సెమీస్‌ చేరుతుంది. ఒకవేళ కంగారూల జట్టు ఓడితే మాత్రం రేసు ఆసక్తికరంగా మారుతుంది. అఫ్గాన్‌ గెలవడంతో పాటు తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమ్‌ఇండియాకు ముందంజ వేసే ఛాన్స్‌ ఉంటుంది. ఈ గ్రూప్‌లో భారత్, ఆసీస్, అఫ్గాన్‌ రెండు విజయాలు సాధిస్తే మెరుగైన రన్‌రేట్‌ కలిగిన రెండు జట్లు ముందంజ వేస్తాయి. రెండు ఓటములతో బంగ్లా రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే! మరోవైపు గ్రూప్‌-2లో త్రిముఖ పోరు నడుస్తోంది. రెండు స్థానాల కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌ పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో అన్ని జట్లు రెండేసి చొప్పున మ్యాచ్‌లు ఆడేశాయి. ఇంకో ఒక్కో మ్యాచ్‌ మాత్రమే మిగిలింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన అమెరికా దాదాపుగా నిష్క్రమించినట్లే! రెండు విజయాలతో 4 పాయింట్లు దక్కించుకున్న దక్షిణాఫ్రికా (0.625) సెమీస్‌కు చేరువగా ఉంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్‌ ఒక్కో మ్యాచ్‌ గెలిచి రెండేసి పాయింట్లతో ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్‌ (0.412) కంటే మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో వెస్టిండీస్‌ (1.814) రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్, ఇంగ్లాండ్‌తో అమెరికా తలపడాల్సి ఉంది. విండీస్‌పై గెలిస్తే సఫారీ జట్టు నేరుగా సెమీస్‌ చేరుతుంది. అప్పుడు అమెరికాపై నెగ్గితే ఇంగ్లాండ్‌ సులువుగా ముందంజ వేస్తుంది. ఒకవేళ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్, అమెరికాపై ఇంగ్లాండ్‌ గెలిస్తే అప్పుడు ఈ మూడు జట్ల ఖాతాలో నాలుగేసి పాయింట్లు ఉంటాయి. ఆ స్థితిలో నెట్‌ రన్‌రేట్‌ కీలక పాత్ర పోషించనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు