T20 world cup: భారత్‌కు ఎదురుందా?

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సూపర్‌-8కు కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది రోహిత్‌సేన. ముందంజ వేయడం దాదాపుగా లాంఛనమే. కానీ జట్టు ఇంకా పూర్తి స్థాయి ఫామ్‌ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో పసికూన అమెరికాతో పోరుకు సిద్ధమైంది టీమ్‌ఇండియా.

Updated : 12 Jun 2024 07:02 IST

నేడు అమెరికాతో పోరు
రాత్రి 8 నుంచి

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సూపర్‌-8కు కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది రోహిత్‌సేన. ముందంజ వేయడం దాదాపుగా లాంఛనమే. కానీ జట్టు ఇంకా పూర్తి స్థాయి ఫామ్‌ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో పసికూన అమెరికాతో పోరుకు సిద్ధమైంది టీమ్‌ఇండియా. రోహిత్‌సేన తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అమెరికా జట్టు పాకిస్థాన్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. యుఎస్‌ఏ జట్టులో చాలా మంది భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఉండడం విశేషం.

న్యూయార్క్‌

బ్యాటుతో పుంజుకోవాలనుకుంటున్న టీమ్‌ఇండియా.. పెద్ద పరీక్షగా మారిన డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో అమెరికాతో తలపడుతుంది. తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. మరోవైపు అనుభవం లేకున్నా అమెరికా ఆకట్టుకుంటోంది. తన చివరి మ్యాచ్‌లో ఏకంగా పాకిస్థాన్‌కు షాకిచ్చింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. ఏ ఫార్మాట్లోనైనా అమెరికా, భారత్‌ తలపడడం ఇదే తొలిసారి.


బ్యాటింగ్‌ మెరుగుపడాలి..

తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపుతో టీమ్‌ఇండియా ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్‌పై 119 పరుగులను కాపాడుకున్న తీరు ఆ జట్టు విశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. కానీ బ్యాటింగ్‌తో భారత్‌ మెరుగుపడాల్సివుంది. గత మ్యాచ్‌లో పరుగుల కోసం చెమటోడ్చిన రోహిత్‌సేన.. 27 పరుగులకే చివరి ఏడు వికెట్లు చేజార్చుకుంది. ఆ తడబాటును అధిగమిస్తూ ఈ మ్యాచ్‌లో స్వేచ్ఛగా చెలరేగాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్‌ కోహ్లి సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. రోహిత్‌ కూడా బ్యాట్‌ ఝళిపించాల్సివుంది. ఇప్పటివరకు రెండంకెల స్కోరును అందుకోలేకపోయిన హిట్టర్లు సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబె ఈ మ్యాచ్‌నైనా సద్వినియోగం చేసుకుంటారా అన్నది చూడాలి. రిషబ్‌ పంత్‌ ఆట మాత్రం జట్టుకు సంతోషాన్నిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాణించిన అతడు, ఈసారి మరింతగా విరుచుకుపడాలని జట్టు కోరుకుంటోంది. పాకిస్థాన్‌తో స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో 31 బంతుల్లో 42 పరుగులు చేసిన అతడు.. టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక బౌలింగ్‌ విభాగంలో బుమ్రా సూపర్‌ ఫామ్‌ జట్టు ధీమాను పెంచుతోంది. పదునైన పేస్‌తో బ్యాటర్లను హడలెత్తిస్తూ పాక్‌పై భారత్‌ను గెలిపించిన అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి.  బుమ్రాకు మిగతా బౌలర్లూ సహకరిస్తే అమెరికాకు కష్టమే. ఆ జట్టు మొదట బ్యాటింగ్‌ చేస్తే మాత్రం మూడంకెల స్కోరును అందుకోవడం కష్టమే. బుమ్రా నేతృత్వంలోని పేస్‌ దళంతో పాటు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం కూడా అమెరికా బ్యాటర్లకు పెద్ద సవాలే.


అమెరికా నిలిచేనా..!

ఈ ప్రపంచకప్‌లో ఆశ్చర్యకర ప్రదర్శన అంటే అమెరికాదే. పసికూనగా టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా రెండు విజయాలతో ఏకంగా సూపర్‌-8 రేసులో నిలిచింది. పాకిస్థాన్‌కు షాకిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ జట్టు ప్రదర్శన ఏదో గాలివాటం అని తీసిపారేయడానికి వీల్లేదు. అనేక మంది భారత సంతతి ఆటగాళ్లతో కూడిన  ఆ జట్టు ప్రపంచకప్‌ ముందు టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-1తో ఓడించింది. కెనడాతో మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆరోన్‌ జోన్స్‌ మంచి ఫామ్‌లో ఉండడం అమెరికాకు మంచి సానుకూలాంశం. అతడు టోర్నీలో ఇప్పటివరకు 66 బంతుల్లో 130 పరుగులు చేశాడు. 12 సిక్స్‌లతో ప్రస్తుత టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా ఉన్నాడు. కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ కూడా ఫామ్‌లో ఉన్నాడు. పెద్ద జట్ల బ్యాటర్లను కట్టడి చేయగల సామర్థ్యం అమెరికాకు ఉందని పాక్‌తో మ్యాచ్‌లో స్పష్టమైంది. భారత్‌పై ఎలా ఆడుతుందో చూడాలి. యుఎస్‌ను భారత్‌ తేలికగా తీసుకుంటే అది పొరపాటే అవుతుంది. టీమ్‌ఇండియా ఎలాటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశముంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్, కోహ్లి, పంత్, సూర్యకుమార్‌ యాదవ్, దూబె, హార్దిక్, జడేజా, అక్షర్‌ పటేల్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్‌

అమెరికా: స్టీవెన్‌ టేలర్, మోనాంక్‌ పటేల్, ఆంద్రీస్‌ గౌస్, ఆరోన్‌ జోన్స్, నితీశ్‌ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్‌ సింగ్, జస్‌దీప్‌ సింగ్, కెంజిగె, సౌరభ్‌ నేత్రావల్కర్, అలీ ఖాన్‌ 


పిచ్‌.. పరిస్థితులు

ఈ ప్రపంచకప్‌లో న్యూయార్క్‌ స్టేడియంలోని డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు బ్యాటర్లకు పీడకలలా మారాయి. వందకు అటు ఇటు స్కోర్లకే జట్లు పరిమితం అవుతున్నాయి. చిన్న లక్ష్యాలను ఛేదించడం కూడా కఠిన సవాలుగా మారుతోంది. అస్థిర బౌన్స్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న పిచ్‌లో కొంత మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌ల్లోలా బంతి అనూహ్యంగా బౌన్స్‌ కాదని భావిస్తున్నారు. కానీ మరోసారి తక్కువ స్కోర్లు నమోదు కావొచ్చు. వాతావరణం వల్ల ఆటకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.


ఇండియా × మినీ ఇండియా

అమెరికా జట్టును మినీ ఇండియాగా భావించవచ్చు. ఎందుకంటే ఆ జట్టులో ఏకంగా ఎనిమిది మంది భారత సంతతి ఆటగాళ్లున్నారు. పాక్‌తో ఆడిన జట్టులో కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ సహా ఆరుగురు భారతీయులే. హర్మీత్, నేత్రావల్కర్, జస్‌దీప్‌ సింగ్, నోస్తుష ప్రదీప్‌ కెంజిగె, నితీశ్‌ కుమార్‌ ఇతర భారత క్రికెటర్లు. ఈ నేపథ్యంలో రెండు జట్ల పోరు ఆసక్తిరేపుతోంది. కొందరు యుఎస్‌ ఆటగాళ్లు ఒకప్పుడు భారత్‌లో ఆడినవాళ్లే. ఫాస్ట్‌బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ అండర్‌-15, రంజీ, విజయ్‌ హజారె ట్రోఫీలో ముంబయి తరఫున సూర్యకుమార్‌తో కలిసి ఆడాడు. ‘‘భారత్‌పై ఆడడం, ముఖ్యంగా సూర్యతో పోటీపడడం నాకు చాలా భావోద్వేగాన్ని కలిగించే విషయం. సూర్యతో నా పరిచయం చాలా పాతది’’ అని నేత్రావల్కర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని