IND vs AUS: గిల్‌.. నువ్వు దేశం కోసం ఆడుతున్నావు.. అవన్నీ భరించాలి: సన్నీ

ఆస్ట్రేలియాతో (IND vs AUS) మూడో టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) తుది జట్టులోకి వచ్చాడు. అయితే, బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో గిల్‌ కిందపడి స్వల్ప గాయానికి గురయ్యాడు. వెంటనే చికిత్స తీసుకొని తన బ్యాటింగ్‌ను కొనసాగించి 21 పరుగులు చేసిన తర్వాత ఔటై పెవిలియన్‌కు చేరాడు.

Published : 02 Mar 2023 01:16 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌కు కేఎల్ రాహుల్‌ స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌కు (Shubman Gill) అవకాశం దక్కింది. గత రెండు మ్యాచుల్లోనూ బెంచ్‌కే పరిమితమైన గిల్‌.. మూడో టెస్టులో 21 పరుగులు చేశాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ కుహ్నెమన్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు ఆసీస్‌ బౌలర్‌ కామెరూన్ గ్రీన్‌ బౌలింగ్‌లో బంతిని ఆడిన గిల్‌ నాన్‌స్ట్రైకింగ్‌లోకి వెళ్తూ డైవ్‌ చేశాడు. దీంతో, తన పొత్తి కడుపునకు పైభాగంలో గీచుకుపోవడంతో స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే వైద్య సాయం తీసుకొన్నాడు. అప్పుడు మరో రెండు బంతులు వేస్తే ఆ ఓవర్‌ పూర్తవుతుంది. ఇదే విషయంపై కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar), ఆసీస్‌ మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్‌ మధ్య వాడీవేడీగా సంభాషణ జరిగింది. 

తొలుత సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘శుభ్‌మన్‌ గిల్‌కు కాస్త రిపేర్‌ అవసరమైంది. పరుగు తీసే క్రమంలో డైవ్‌ చేయడంతో గాయపడ్డాడు. వెంటనే వైద్యబృందం కోసం అడిగాడు. ఇదే నేను చెబుతున్న విషయం.. మరో రెండు బంతులు వేస్తే ఆ ఓవర్‌ పూర్తవుతుంది. అప్పుడు చికిత్స తీసుకుంటే బాగుండేది. కాస్త వేచి చూస్తే బాగుండేది. ఎందుకంటే, ఫాస్ట్‌బౌలర్‌ నాలుగు బాల్స్‌ వేసి హాట్‌గా  ఉన్నాడు. ఇలాంటి సమయంలో బ్రేక్‌ ఇవ్వడం వల్ల ఆ బౌలర్‌కు విశ్రాంతి దొరికింది. అందుకే, గిల్‌ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్నాడు కాబట్టి, ఓ రెండు నిమిషాలు ఓపికగా ఉంటే సరిపోయేది. సాధారణమైన విషయాలే కొన్నిసార్లు చాలా వ్యత్యాసం కనిపించేలా చేస్తాయి’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. 

అయితే గావస్కర్‌ వ్యాఖ్యలను కొట్టిపడేస్తూ.. ‘‘మీరు చాలా కఠినమైన వ్యక్తిలా ఉన్నారు సన్నీ. గాయం నిజంగా నొప్పి కలిగిస్తుంది’’ అని మ్యాథ్యూ హేడెన్‌ చెప్పగా.. మరోసారి సునీల్‌ గావస్కర్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు. ‘‘నొప్పి నిజమే కావచ్చు. కానీ, దేశం కోసం ఆడుతున్నప్పుడు.. మరో రెండు బంతుల కోసం వేచి ఉంటే బాగుండేది. అతడు స్ట్రైకింగ్‌లో ఉంటే ఆ బాధను ఓర్చుకుంటూ ఆడటం అసౌకర్యంగా ఉంటుంది. కానీ, గిల్‌ అప్పుడు నాన్‌స్ట్రైకింగ్‌లో ఉండటం వల్ల కాసేపు ఆగేందుకు అవకాశం ఉంటుంది’’ అని సన్నీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని