IND vs AUS: తొలి ఓవర్‌లోనే కాస్త మెరుపు.. ఆఖరికి ఆసీస్‌దే గెలుపు

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) ఆసీస్‌ తొలి విజయం నమోదు చేసింది. మూడో రోజు తొలి సెషన్‌ ఆట కూడా పూర్తి కాకుండానే భారత్‌ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్య ఛేదనను ఆసీస్‌ (IND vs AUS) కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే నష్టపోయి విజయం సాధించింది.

Updated : 03 Mar 2023 14:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అద్భుతం జరిగి స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కాపాడుకుంటుందేమోననే అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy) మూడో టెస్టులో (IND vs AUS) భారత్‌ఫై ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  టీమ్‌ఇండియా నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యం 2-1కి తగ్గింది. చివరి టెస్టు మ్యాచ్‌ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది.

రెండో బంతికే షాక్.. కానీ

టీమ్‌ఇండియా నిర్దేశించిన 76 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. రెండో బంతికే కీలకమైన ఉస్మాన్ ఖవాజా (0) రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్‌లో కీపర్‌ శ్రీకర్ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే, ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబుషేన్ (28*)తో కలిసి మరో ఓపెనర్ ట్రావిస్‌ హెడ్ (49*) మ్యాచ్‌ను పూర్తి చేసేశాడు. ఆరంభంలో వీరిద్దరూ ఆచితూచి ఆడినప్పటికీ.. క్రమంగా దూకుడు పెంచి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేసినప్పటికీ అడపాదడపా భారీ షాట్లు కొట్టి ఛేదనను తేలిక చేశారు. రెండో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించారు.

లైయన్‌ అదరగొట్టిన పిచ్‌పై..

ఇదే పిచ్‌పై రెండో రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్‌ నాథన్ లైయన్‌ చెలరేగిపోయాడు. ఏకంగా 8 వికెట్లు తీసి టీమ్‌ఇండియాను దెబ్బకొట్టాడు. దీంతో ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. కానీ, భారత స్పిన్నర్లు మాత్రం ఆసీస్ బ్యాటర్లపై ఆధిక్యం సాధించలేకపోయారు. పర్యాటక బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ నష్టపోయాక ఎటాకింగ్‌ గేమ్‌ ఆడేశారు. దీంతో జడేజా, అశ్విన్‌ వారికి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. భారత్‌ తన రెండు ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లను ఆసీస్‌ స్పిన్నర్లకే సమర్పించగా.. టీమ్‌ఇండియా స్పిన్నర్లు మాత్రం కేవలం 8 వికెట్లను మాత్రమే తీయగలిగారు. స్పిన్‌ ఉచ్చు తిరిగి భారత్‌కే రివర్స్‌ కావడం గమనార్హం. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టులు.. మూడు రోజుల్లోపే ముగిశాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు