WTC Finals: కుర్రాళ్లు మానసికంగా సిద్ధమయ్యారు

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా మానసికంగా సిద్ధంగా ఉందని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నారు. సాధనకు సమయం లేకపోవడం పట్ల ఆందోళన లేదని పేర్కొన్నారు.....

Published : 02 Jun 2021 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా మానసికంగా సిద్ధంగా ఉందని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నారు. సాధనకు సమయం లేకపోవడం పట్ల ఆందోళన లేదని పేర్కొన్నారు. ప్రత్యర్థి జట్టులోనూ బలమైన క్రికెటర్లు ఉన్నారని వెల్లడించారు. కొవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో విరాట్‌ కోహ్లీ, హనుమ విహారి, హార్దిక్‌ పాండ్య సహా క్రికెటర్లు పాలుపంచుకోవడం సంతోషకరమని తెలిపారు.

‘సాధనకు సమయం లేనందుకు ఆందోళనేమీ లేదు. పూర్తి సన్నద్ధత లేకపోవడం మాకు అనుకూలమే. ఎందుకంటే మా ఆటగాళ్లు మానసికంగా మరింత సన్నద్ధంగా ఉంటారు. గాయపడ్డప్పుడు ఆడినట్లుగా అన్నమాట. మా క్రికెటర్లు నెలల తరబడి క్రికెట్‌ ఆడుతూనే ఉన్నారు. ఐపీఎల్‌ వాయిదా పడటం దురదృష్టకరం. క్వారంటైన్లో కుర్రాళ్లు దేహదారుఢ్యం పెంచుకుంటారు. ఫైనల్‌కు తాజాగా సిద్ధమవుతారు’ అని శ్రీధర్‌ అన్నారు.

‘మా క్రికెటర్లంతా ప్రొఫెషనల్స్‌. ఏడాది సాంతం ఫిట్‌నెస్‌తో ఉంటారు. క్వారంటైన్‌ సమయంలో వారితో ప్రత్యేకమైన కసరత్తులేమీ చేయించడం లేదు. ఆటగాళ్లకు ఏవి ఎలా పనిచేస్తాయో తెలుసని నమ్ముతా. అవసరమనిపిస్తేనే జోక్యం చేసుకుంటాను. నేను వాళ్లతోనే ఉంటానని తెలుసు కాబట్టి నా సాయం అవసరమైతే కోరతారు. ఇక ప్రత్యర్థి జట్టులో కొందరిపైనే మేం దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్‌ బలమైన జట్టు. తటస్థ వేదిక కాబట్టి వారికీ, మాకూ ఒకేలాంటి అవకాశాలు ఉంటాయి’ అని శ్రీధర్‌ తెలిపారు.

కొవిడ్‌-19 వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని శ్రీధర్‌ అన్నారు. తనకు తోచిన రీతిలో కొవిడ్‌ బాధితులకు సాయం చేస్తున్నానని వెల్లడించారు. కోహ్లీ, విహారి, పాండ్య, ఇంకా మరెంతో మంది క్రికెటర్లు చేయూతనందించడం గర్వకారణమని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని