WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్.. ‘ఫైనల్‌’కు దగ్గరైన టీమ్‌ఇండియా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ పోరుకు భారత్‌(Team India) మరో అడుగు ముందుకేసింది. నాగ్‌పూర్‌ టెస్టులో ఘన విజయం సాధించి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

Updated : 11 Feb 2023 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిష్ఠాత్మక బోర్డర్‌ - గావస్కర్‌ (Border-Gavaskar Trophy) ట్రోఫీని టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది. తొలి టెస్టులో ఆది నుంచే పట్టుబిగించిన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (World Test Championship) ఫైనల్‌ పోరుకు భారత జట్టు (Team India) మరింత దగ్గరైంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా (Team India) గెలుపు శాతం నాగ్‌పూర్‌ టెస్టుకు ముందు 58.93గా ఉండగా.. నేటి విజయంతో అది 61.67 శాతానికి పెరిగింది. ఇక ఈ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆసీస్‌ (Australia)  గెలుపు శాతం 75.56 నుంచి 70.83కు పడిపోయింది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన టీమ్‌ఇండియా.. ఈసారి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలంటే బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింట విజయం సాధించాలి.

మరోవైపు ఈ పాయింట్ల పట్టికలో శ్రీలంక (53.33శాతం), దక్షిణాఫ్రికా (48.72) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జట్ల ‘ఫైనల్‌’ అవకాశాలు కూడా బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ, ఈ సిరీస్‌లో ఆసీస్‌ జట్టు పుంజుకుని 2-2తో విజయం సాధించి.. అటు న్యూజిలాండ్‌తో సిరీస్‌ను శ్రీలంక 2-0తో గెలిస్తే.. భారత్‌ ఫైనల్‌ (WTC Final) పోరుకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఇప్పటికే ఫైనల్‌ రేసు నుంచి వైదొలిగాయి.

నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శతకానికి తోడు అక్షర్‌ పటేల్‌, జడేజా మెరుపులు మెరిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 400 పరుగులు చేసింది. అంతకుముందు భారత స్పిన్నర్ల ధాటికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో రోహిత్‌ సేన విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంతో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని