T20 World Cup: టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదు : సెహ్వాగ్

పాకిస్థాన్ జట్టులా టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని మాజీ క్రికెటర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. ‘ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నాం’ అని పాకిస్థాన్‌కి చెందిన ఓ యాంకర్‌ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్‌ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచ కప్‌ లాంటి..

Published : 19 Oct 2021 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్ జట్టులా టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని మాజీ క్రికెటర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. ‘ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నాం’ అని పాకిస్థాన్‌కి చెందిన ఓ యాంకర్‌ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్‌ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచ కప్‌ లాంటి మెగా టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్‌ ఉంటే.. పాకిస్థాన్ జట్టు ఈ సారి కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని విమర్శించాడు. కానీ, టీమిండియా ఆటగాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రాక్టీసులో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నాడు. ఆ కారణంగానే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ సంపూర్ణ ఆధిక్యం చలాయిస్తోందని తెలిపాడు. 

‘ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్థాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటంతో.. 2003, 2011 ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగాం. మేమెప్పుడూ సానుకూల వైఖరితోనే ఆడతాం. (‘ఈ సారి మేం చరిత్ర సృస్టించబోతున్నాం’ అన్న యాంకర్‌ మాటలను ఉద్దేశించి) అంతేకాని పాకిస్థాన్‌లా గొప్పలు చెబుతూ కూర్చోం. టీమిండియా ఎప్పుడూ అలాంటి ప్రకటనలు చేయదు. మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా సంసిద్ధమైతే ఫలితాలు అవే వస్తాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే.. టీ20ల్లో పాకిస్థాన్‌ మెరుగ్గా కనిపిస్తోంది. అందుకే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఇది 50 ఓవర్ల మ్యాచ్‌ కాదు.. పొట్టి క్రికెట్లో ఒక్క ఆటగాడు రాణించినా మ్యాచ్‌ ఫలితాలు తారుమారు అయిపోతాయి. అయితే, పాకిస్థాన్ ఇప్పటివరకు అలా చేయలేకపోయింది. చూద్దాం.! అక్టోబరు 24న ఏం జరుగుతుందో’ అని వీరేందర్ సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. 

పాకిస్థాన్‌ భారత్ జట్లు తలపడిన ప్రతిసారి ఈ సారి ఎవరు గెలుస్తారనే విషయంపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ సారైనా భారత్‌పై పాకిస్థాన్‌ గెలుస్తుందా.? లేక ప్రపంచకప్‌లో భారత్ తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తుందా.? అన్న నడుస్తూనే ఉంటుంది. అయితే, ఐసీసీ ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు పాకిస్థాన్‌ జట్టు టీమిండియాను ఓడించలేదు. 2007లో టీ20 ప్రపంచకప్‌ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్-పాక్‌ జట్లు 5 సార్లు తలపడితే.. ఐదు సార్లు టీమిండియానే విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఏడు సార్లు పోటీపడగా.. అన్నిసార్లు భారత జట్టే విజేతగా నిలిచింది. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 12-0తో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది. అక్టోబరు 24న జరుగనున్న ఇరు జట్ల మధ్య జరుగనున్న మ్యాచులో కూడా విజయం సాధించి ఆధిక్యాన్ని 13-0కి పెంచాలనే కసితో కోహ్లీసేన బరిలోకి దిగనుంది. కాగా, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని జట్టులో లేకుండా జరుగుతున్న తొలి ప్రపంచకప్ ఇదే కావడం గమనార్హం. అయితే, ఈ ప్రపంచకప్‌నకు ధోని టీమిండియా మెంటార్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని