శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..

ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసి అద్వితీయ సిరీస్‌ విజయంలో కీలక బౌలర్‌గా సేవలందించిన టీమ్‌ఇండియా పేసర్‌‌ మహ్మద్‌ సిరాజ్‌ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్‌ విమానాశ్రయానికి...

Updated : 21 Jan 2021 17:48 IST

శంషాబాద్‌: ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా పేసర్‌‌ మహ్మద్‌ సిరాజ్‌ గురువారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభించింది. సిడ్నీ టెస్టులో అతడు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొని ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. సిరీస్‌లో‌ నిర్ణయాత్మకమైన గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం ఐదు వికెట్లు తీసి ఆ జట్టు భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించాడు. ఆపై రిషభ్‌ పంత్‌(89*) చెలరేగడంతో టీమ్‌ఇండియా 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. 

ఐపీఎల్‌ తర్వాత ఇతర ఆటగాళ్లతో కలిసి సిరాజ్‌ నేరుగా యూఏఈ నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అదే సమయంలో సిరాజ్‌ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. అయినా, ఈ హైదరాబాదీ పేసర్‌ చివరి చూపులకు రాకుండా జట్టు కోసం అక్కడే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ మంచి ప్రదర్శన చేసిన సిరాజ్‌ అందరి ప్రశంసలు పొందాడు. 

అలాగే, ఇతర ఆటగాళ్లు కూడా భారత్‌కు చేరుకున్నారు. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకుర్‌, పృథ్వీషా, కోచ్‌ రవిశాస్త్రి ముంబయికి చేరుకోగా.. నటరాజన్‌ బెంగళూరు విమానాశ్రయంలో దిగి తమిళనాడులోని స్వగ్రామానికి పయనమయ్యాడు. గబ్బా హీరో రిషభ్‌ పంత్‌ దిల్లీకి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన ఆటగాళ్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. వీరు శుక్రవారం ఉదయం నేరుగా చెన్నైకి చేరుకోనున్నారు. కాగా, వారికి ఆయా విమానాశ్రయాల్లో ఘన స్వాగతం లభించింది.

ఇవీ చదవండి..
రిషభ్‌ పంత్ కాదు.. స్పైడర్‌ పంత్‌: ఐసీసీ
2-1 కాదు 2-0!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని