
T20 World Cup: తొలి కప్ కొట్టారు సరే.. మరి మిగతా వాటి సంగతి?
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ప్రజాదరణ ఏ క్రీడకు ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. భారతీయుల నరనరాన క్రికెట్ ఇంకిపోయిందనే చెప్పొచ్చు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు జరిగే ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. మొన్నటి వరకు ఐపీఎల్ వినోదంలో ప్రేక్షకులు మునిగిపోయారు. ఆ జ్ఞాపకాలను మరువకముందే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది.
పొట్టికప్ కోసం భారత్ తన వేటను చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశం పాకిస్థాన్‌తో నేడు ఆరంభించనుంది. 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ పోటీలు జరిగాయి. గతేడాది జరగాల్సిన ప్రపంచకప్ కరోనా నేపథ్యంలో ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అలానే మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్‌ను ధోనీ నేతృత్వంలోని భారత్ కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ధోనీ మెంటార్‌గా కోహ్లీసేన బరిలోకి దిగడం విశేషం. 2007 నుంచి గత టీ20 ప్రపంచకప్ వరకు మెగా ఈవెంట్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందో ఓ సారి గుర్తు చేసుకుందాం..
కొత్త నాయకుడు.. కసిగా ఆడి కప్ కొట్టారు
ఆ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవం.. సీనియర్ల త్రయం సచిన్, గంగూలీ, ద్రవిడ్ లేరు.. కొత్త సారథిగా యువకుడు ఎంఎస్ ధోనీ ఎంపిక. ఆ.. వీళ్లేం ఆడతారులే అన్న విమర్శకుల నోటికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. కప్ కొట్టాలనే కసి ప్రతి ఆటగాడిలో కనిపించిన వేళ.. టీమిండియా అద్భుతమే సృష్టించింది. దాయాది దేశం పాకిస్థాన్‌ను ఫైనల్లో చిత్తు చేసి సగర్వంగా తొలి టీ20 ప్రపంచకప్‌ను ధోనీసేన అందుకుంది. ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ శర్మను, కీలకమైన క్యాచ్ పట్టిన శ్రీశాంత్‌ను ఎప్పటికీ మరువలేం. అప్పటి కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం టీమిండియాకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషం.
విశేషాలు..
* తొలి టీ20 ప్రపంచకప్‌లో 12 జట్లు పాల్గొనగా.. నాలుగు గ్రూప్‌లు విడిపోయి మరీ పోటీపడ్డాయి. ఆయా గ్రూపుల్లో టాప్‌గా నిలిచిన ఎనిమిది జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. సెమీస్‌కు భారత్, న్యూజిల్యాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా వచ్చాయి.
* అప్పటికే ఆసీస్‌కు భీకరమైన జట్టుగా పేరుంది. మరి అలాంటి జట్టును సెమీస్‌లో భారత్ మట్టికరిపించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 188/5 స్కోరు చేయగా.. ఆస్ట్రేలియాను 173 పరుగులకే పరిమితం చేసి భారత్ ఫైనల్‌కు చేరింది.
* లీగ్ దశలోనే సూపర్ ఓవర్‌తో పాక్‌పై నెగ్గిన భారత్‌కు మళ్లీ పాక్ కఠిన సవాల్ విసిరింది. చివరి వరకు పోరాడిన పాకిస్థాన్‌పై ఫైనల్లో భారత్ ఐదు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించి పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత భారత్ 157/5 చేయగా.. పాకిస్థాన్‌ను 152 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆఖర్లో మిస్బా ఉల్ హక్(43) కంగారు పెట్టినా జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో శ్రీశాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరడంతో పొట్టికప్ భారత జట్టు సొంతమైంది.
ఛాంపియన్ ఓడింది.. గత రన్నర్ టైటిల్ కొట్టింది
రెండేళ్ల తర్వాత 2009లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం సూపర్ 8లోనే ముగిసింది. లీగ్ దశలో బంగ్గాదేశ్, ఐర్లాండ్ వంటి చిన్న జట్లపై విజయం సాధించి సూపర్8కి చేరిన టీమిండియాకు అసలైన సవాల్ ఎదురైంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌తో కూడిన గ్రూప్‌లో భారత్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించలేక చతికిలపడింది. గత ఛాంపియన్ అయిన టీమిండియా కఠినమైన జట్లతో పోరాడలేక చేతులెత్తేసింది. వెస్టిండీస్‌పై ఏడు వికెట్లు, ఇంగ్లాండ్ మీద మూడు పరుగులు, దక్షిణాఫ్రికా మీద 12 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. తక్కువ లక్ష్యాన్ని కూడా ఛేదించడంలో భారత్ విఫలమైంది. దీంతో ఒక్క విజయం కూడా లేకుండా సూపర్ 8 స్టేజ్‌ను టీమిండియా ముగించింది.
* సూపర్8లో టాప్ నాలుగు జట్లు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక సెమీస్‌కు చేరాయి. సెమీస్‌లో సౌతాఫ్రికాపై పాక్, వెస్టిండీస్‌పై లంక విజయం సాధించి ఫైనల్‌కు అడుగుపెట్టాయి. తుదిపోరులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధించి.. 2007లో చేజారిన పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. షాహిది అఫ్రిదీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాక్‌ను విజేతగా నిలిపాడు.
* పది నెలలకే జరిగిన 2010 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ సూపర్-8లోనే ఇంటిముఖం పట్టింది. లీగ్ దశలో టాప్‌లో నిలిచి సూపర్-8కి చేరిన భారత్.. ఒక్క విజయాన్ని నమోదు చేయకపోవడం గమనార్హం. ఆసీస్, శ్రీలంక, వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ గెలిచి 2010 పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
దెబ్బకొట్టిన నెట్‌రన్‌రేట్
గత రెండు (2009,2010) టీ20 ప్రపంచకప్‌ల్లో ప్రదర్శన మాదిరిగానే 2012 టీ20 వరల్డ్‌కప్‌లోనూ భారత్ విఫలమైంది. ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్‌తో కూడిన గ్రూప్‌దశలో టీమిండియా టాప్‌గా నిలిచి సూపర్-8కి దూసుకెళ్లింది. అయితే సూపర్-8లోనూ రాణించినా నెట్రన్నరేట్ కారణంగా సెమీస్‌కు వెళ్లే అవకాశం భారత్ చేజారింది. ఆసీస్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, టీమిండియా సూపర్-8లో ఓ గ్రూప్ ఉన్నాయి. భారత్, ఆసీస్, పాకిస్థాన్ చెరో నాలుగేసి పాయింట్లు దక్కించుకున్నాయి. అయితే భారత్ కంటే ఆ రెండు జట్లకు ఎక్కువ నెట్‌రన్‌రేట్ ఉంది. దీంతో పాక్, ఆసీస్ సెమీస్‌కు చేరుకోవడంతో టీమిండియా కథ ముగిసింది.
* తొలి సెమీఫైనల్లో శ్రీలంక, పాకిస్థాన్.. రెండో సెమీఫైనల్లో వెస్టిండీస్, ఆసీస్ తలపడ్డాయి. చివరి పోరుకు లంక, వెస్టిండీస్ చేరుకున్నాయి. తక్కువ స్కోర్లు నమోదైన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను వెస్టిండీస్ మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 137/6 స్కోరు చేయగా.. లంక 101 పరుగులకే ఆలౌట్ అయింది.
ఫైనల్లో తప్పని ఓటమి..
తొలిసారి పదహారు జట్లు 2014 టీ20 ప్రపంచకప్ కోసం తలపడ్డాయి. నేరుగా ఎనిమిది జట్లు అర్హత సాధించగా.. క్వాలిఫయర్ నుంచి రెండు జట్లు స్థానం సంపాదించాయి. సూపర్-10లో భాగంగా రెండు గ్రూప్‌ల్లో ఐదేసి జట్లు మ్యాచ్‌లు ఆడాయి. ఈ గ్రూపుల్లో తొలి రెండు స్థానాలు సాధించిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అంతకుముందు మూడు ప్రపంచకప్ పోటీల్లో సూపర్-8 స్టేజీలోనే వెనుదిరిగిన భారత్ ఐదో టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే తుదిపోరులో లంక చేతిలో భంగపాటుకు గురై రన్నరప్‌గా నిలిచింది.
* భారీ స్కోర్లు నమోదైన సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (3/22) సూపర్ స్పెల్ వేశాడు. అనంతరం విరాట్ కోహ్లీ (72) అద్భుత అర్ధశతకంతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (24), రహానె (32), సురేశ్ రైనా (21) రాణించారు.
* శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ (77), రోహిత్ శర్మ (29) రాణించారు. అయితే లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం కుమార సంగక్కర (52) అర్ధశతకంతో లంకను విజేతగా నిలిపాడు. తిసారా పెరీరా ( 14 బంతుల్లో 23 పరుగులు) దూకుడుగా ఆడటంతో శ్రీలంక 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. దీంతో టైటిల్‌ను గెలవాలనే భారత్ ఆశ ఆవిరైపోయింది.
స్వదేశంలో ఆతిథ్యం.. సెమీస్‌లోనే ఓటమి
అంతకుముందు (2014) త్రుటిలో టైటిల్‌ను కోల్పోయిన టీమిండియా 2016 టీ20 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శనే ఇచ్చింది. ఈసారి కూడా పదహారు బరిలోకి నిలిచినా సూపర్-10 పోటీలు జరిగాయి. గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి కఠిన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ.. విజయవంతంగా సెమీస్‌కు చేరుకుంది. అయితే భారీ స్కోరు నమోదైన సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 192/2 స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ (89*) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే విండీస్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేసి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫైనల్లోనూ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి వెస్టిండీసే టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
* గ్రూప్ స్టేజ్‌లో కివీస్‌పై భారత్ మాత్రం ఘోర పరాజయం మూటకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అనంతరం పేలవ బ్యాటింగ్‌తో టీమిండియా కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. ధోనీ (30) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్ మిచెల్ సాట్నర్ (4/11) దెబ్బకు భారత బ్యాటర్లు విలవిలాడారు. రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 2008లో ఆసీస్‌పై 74 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ మినహా ఆసీస్, పాక్, బంగ్లాపై గెలిచి సెమీస్‌కు భారత్ చేరుకుంది. సెమీఫైనల్లో విండీస్ ముందు తలవంచక తప్పలేదు.
2018లో జరగని పొట్టి ప్రపంచకప్
కనీసం ప్రతి రెండేళ్లకొకసారి టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలనేది ఐసీసీ నిర్ణయం. అయితే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉండటం.. 2018లో ఐసీసీ సభ్యదేశాల క్రీడా షెడ్యూల్ బిజీగా ఉండటంతో దానిని 2020లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే గతేడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా పరిస్థితులతో వాయిదా పడి ఈ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో మెగా టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు చెబుతానని విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో మెంటార్ ఎంఎస్ ధోనీ మార్గదర్శకత్వంలో.. రవిశాస్త్రి-విరాట్ కాంబినేషన్ ఐసీసీ కప్‌ను సాధించి తీరాలని టీమిండియా జట్టు సహా ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.
-ఇంటర్నెట్ డెస్క్