IND vs SL : టీమ్‌ఇండియాకు ‘గులాబీ’ గుబాళించేనా...? గుచ్చుకునేనా..?

అంతర్జాతీయంగా సుదీర్ఘ ఫార్మాట్‌ టెస్టు క్రికెట్‌కు ప్రత్యేక స్థానముంది. వన్డేలు, టీ20లు వచ్చిన ...

Updated : 12 Mar 2022 13:22 IST

ఈ మధ్యాహ్నం నుంచి లంకతో డే/నైట్ టెస్టు మ్యాచ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయంగా సుదీర్ఘ ఫార్మాట్‌ టెస్టు క్రికెట్‌కు ప్రత్యేక స్థానముంది. వన్డేలు, టీ20లు వచ్చిన తర్వాత ఆటలో వేగం పెరిగింది. అయితే ఇప్పటికీ టెస్టు క్రికెట్‌నే క్లాస్‌ ఆటగా చెప్పేవారూ ఉన్నారంటే అభిమానుల్లో ఆదరణ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐదు రోజులపాటు ఇరు జట్లు విజయం కోసం పోరాటం సాగించే తీరు ఇటీవల మరింత ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఐసీసీ గులాబీ బంతి (పింక్‌ బాల్) క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టింది. టీమ్‌ఇండియా ఇప్పటి వరకు మూడే గులాబీ టెస్టులను ఆడింది. మరి ఎప్పుడు గులాబీ టెస్టులు ప్రారంభమయ్యాయి.. ఎన్ని జరిగాయి.. భారత్ పరిస్థితేంటో తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 2015 నవంబర్ 27-డిసెంబర్‌ 1 వరకు తొలి గులాబీ టెస్టు (డే/నైట్‌) జరిగింది. అందులో ఆసీస్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 టెస్టులు జరిగాయి. మార్చి 12 నుంచి 16వ తేదీ వరకు భారత్-శ్రీలంక మధ్య జరిగే బెంగళూరు టెస్టు అంతర్జాతీయంగా 19వ మ్యాచ్‌. రికార్డుపరంగా చూసుకుంటే... ఆస్ట్రేలియానే ఎక్కువ మ్యాచ్‌లను గెలిచింది. పది టెస్టులకుగాను పదింటిలోనూ విజయం సాధించడం విశేషం. టీమ్‌ఇండియాకు మాత్రం ఇది నాలుగో డే/నైట్ టెస్టు. మిగతా మూడు మ్యాచుల్లో భారత్‌ రెండు విజయాలు, ఒక ఘోర ఓటమి చవిచూసింది. మరి ఈసారి గులాబీ టెస్టులో భారత్‌ గుబాళిస్తుందా..? గుచ్చుకుంటుందో వేచి చూడాలి. 

తొలి గులాబీ టెస్టులో...?


ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన తొలి గులాబీ టెస్టులో (2019 నవంబర్ 22-26) పసికూన బంగ్లాదేశ్‌ను భారత్‌ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం టీమ్‌ఇండియా 347/9 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. విరాట్ కోహ్లీ (136) శతకం సహా ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 241 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన బంగ్లాదేశ్‌ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ ఇషాంత్ శర్మ (5/22, 4/45), ఉమేశ్‌ యాదవ్ (3/29, 5/53) బౌలింగ్‌లో చెలరేగారు. ఈసారి గులాబీ టెస్టులోనైనా విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 


ఆసీస్‌ చేతిలో ఘోర ఓటమి...


 

కొన్నేళ్లుగా విదేశీ పిచ్‌లపైనా రాణిస్తున్న టీమ్‌ఇండియాకు 2020 ఆసీస్‌ పర్యటనలో భారీ షాక్‌ తగిలింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో (డై/నైట్‌) భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవం చవిచూసింది. గులాబీ బంతితో ఆసీస్‌ బౌలర్లు హేజిల్‌వుడ్‌(5), కమిన్స్‌(4) వికెట్లతో చెలరేగడంతో భారత్‌ చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేయగా.. ఆసీస్‌ 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ 53 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు బౌలర్ల దెబ్బకు వికెట్లు టపటపా రాలాయి. కేవలం 36 పరుగులకే ఆలౌటై టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డును టీమ్‌ఇండియా మూట గట్టుకుంది. అనంతరం 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లను మాత్రమే నష్టపోయి ఛేదించింది. అయితే మిగిలిన టెస్టుల్లో రెండు గెలిచి, ఒకదానిని డ్రా చేసుకుని భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం. 


మరోసారి స్వదేశీ పిచ్‌పై.. 

భారత్‌ స్వదేశీ మైదానాల్లో చెలరేగిపోతుంది. మన బౌలర్లకు తగ్గట్టు పిచ్‌ రూపొందించుకొనే అవకాశం ఉండటంతో స్పిన్‌కు అనుకూలంగా అహ్మదాబాద్‌ పిచ్‌ను క్యూరేటర్ తయారు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ (6/38), అశ్విన్‌ (3/27) దెబ్బకు 112 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. అయితే ఇంగ్లాండ్ పార్ట్‌టైమ్‌ బౌలర్‌ జో రూట్ (5/8), జాక్ లీచ్ (4/54), ఆర్చర్ (1/24) చెలరేగడంతో భారత్ 145 పరుగులే చేయగలిగింది. 33 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను మరోసారి అక్షర్‌ పటేల్ (5/32), అశ్విన్ (4/48), వాషింగ్టన్ సుందర్ (1/1) చెలరేగడంతో 81 పరుగులకే ఆలౌటైంది. 49 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. ప్రత్యర్థికి చెందిన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 19 వికెట్లను స్పిన్నర్లే కూల్చారు. 


ఈసారి చిన్నస్వామి స్టేడియంలో..

భారత్Xశ్రీలంక జట్ల మధ్య జరిగే డే/నైట్ టెస్టుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గులాబీ బంతి టెస్టులోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ భావిస్తోంది. మరోవైపు శ్రీలంక జట్టు టీమ్‌ఇండియా కంటే ముందే డే/నైట్ మ్యాచ్‌ ఆడటం విశేషం. 2017లోనే పాకిస్థాన్‌తో లంక గులాబీ టెస్టు ఆడింది. పాక్‌పై లంక 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు లంక కూడానూ మూడే గులాబీ టెస్టులను ఆడింది. ఇరు జట్లకూ నాలుగోది కావడం.. సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్‌ను రూపొందించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు