Mega Auction 2022: ఈ క్రికెటర్లపై కాసుల వర్షం కురిసేనా?

మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ సీజన్‌లో పది జట్లు అలరించనున్నాయి...

Updated : 29 Mar 2022 19:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 టోర్నీ మెగా వేలం సమయం దగ్గరపడుతోంది. ఈ సీజన్‌లో పది జట్లు అలరించనున్నాయి. లఖ్‌నవూ, గుజరాత్ జట్లు కొత్తగా వస్తున్నాయి. దీంతో ఆటగాళ్ల కోసం మెగా వేలంను ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ మెగా వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్న భారత ఆటగాళ్లెవారో ఓ సారి తెలుసుకుందాం.

శ్రేయస్ అయ్యర్‌..

టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కు టీ20 టోర్నీలో అపారమైన అనుభవం ఉంది. 2015లో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు ఇప్పటివరకు 87 మ్యాచ్‌ల్లో 31.66 సగటుతో 2375 పరుగులు చేశాడు. దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే శ్రేయస్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. 2020లో దిల్లీకి సారథిగా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 519 పరుగులు చేసి జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల టీమ్ఇండియా తరఫున కూడా నిలకడగా ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇతడి కనీస ధర రూ.2 కోట్లు. కెప్టెన్సీ అనుభవం ఉన్న ఈ క్రికెటర్‌ను దక్కించుకోవాలని.. కెప్టెన్లు లేని బెంగళూరు, పంజాబ్, కోల్‌కతా ఫ్రాంచైజీలు యోచిస్తున్నాయి.

ఇషాన్‌ కిషన్‌.. ఎడమ చేతివాటం కలిగిన ఈ యువ బ్యాట్స్‌మన్‌.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. ఇప్పటివరకు 61 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ఈ ప్లేయర్ 1,452 పరుగులు చేశాడు. ఇన్నాళ్లు ముంబయికి ఆడిన ఇషాన్‌ కిషన్‌ ఈ సారి వేలంలోకి వచ్చాడు. అతడి కనీస ధర రూ.2 కోట్లు. 2018లో జరిగిన వేలంలో ముంబయి ఇతడిని రూ. 6.2 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సారి కూడా ధర ఎంతైనా అతడిని దక్కించుకోవాలని ముంబయి భావిస్తోందని సమాచారం. 

దీపక్ చాహర్..

చెన్నై ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఉన్న దీపక్‌ చాహర్‌ ఈ సారి వేలంలోకి వచ్చాడు. మంచి ఇన్‌స్వింగ్, ఔట్‌ స్వింగ్‌ బంతులతో బ్యాటర్లను హడలెత్తించే ఈ యువ బౌలర్‌ ఇప్పటివరకు 63 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. పవర్‌ ప్లేలో పరుగులు కట్టడి చేయడంలో దీపక్ దిట్ట. ఇటీవల జరిగిన వన్డేల్లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసి మంచి పరుగులు సాధించాడు. ఈ వేలంలో ఇతడి కనీస ధర రూ.2 కోట్లు. చెన్నైతో సహా హైదరాబాద్‌, బెంగళూరు, గుజరాత్‌ పోటీ పడే అవకాశం ఉంది.

శార్దూల్ ఠాకూర్‌..

టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ శార్దూల్ ఠాకూర్‌ 2015లో పంజాబ్‌ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2017లో పుణె జట్టులో ఆడాడు. 2018లో జరిగిన వేలంలో చెన్నై అతడిని రూ.2.5 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు 61 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు పడగొట్టాడు. ఈ ఆటగాడు ఇప్పుడిప్పుడే ఆల్‌రౌండర్‌గా అవతరిస్తున్నాడు. ఇటీవల టీమ్‌ఇండియా తరఫున కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్‌ భారీ ధరను దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

హర్షల్ పటేల్..

గత సీజన్‌లో 32 వికెట్లు తీసిన బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఇలాంటి ఆటగాడిని బెంగళూరు రిటెన్షన్‌ చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. యార్కర్లు, స్లో బాల్స్‌ వేయడంలో రాటుదేలిన ఈ బౌలర్‌కు వేలంలో భారీ ధర దక్కడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. హర్షల్ ఇప్పటివరకు 63 మ్యాచ్‌ల్లో 8.14 ఎకానమీతో 78 వికెట్లు పడగొట్టాడు. 5/27 అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.

ప్రసిద్ధ్‌ కృష్ణ..

టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ నిలిచాడు. మొదటి వన్డేలో రెండు, రెండో వన్డేలో 4 వికెట్లు, మూడో వన్డేలో 3 వికెట్లు తీశాడు. కర్ణాటకకు చెందిన ఈ 25 ఏళ్ల కుర్రాడు 2018లో కోల్‌కతా తరఫున టీ20 టోర్నీలో అరంగేట్రం  చేశాడు. 2018లో జరిగిన వేలంలో తొలుత ప్రసిద్ధ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. కోల్‌కతా ఆటగాడు కమలేశ్‌ నాగర్‌కోటి జట్టు నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నిలకడగా వికెట్లు తీస్తూ  ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. 2018 నుంచి 2021 సీజన్‌ల్లో ప్రసిద్ధ్‌ ఏడాదికి రూ.20 లక్షలు తీసున్నాడు. ఈ మెగా వేలంలో తన కనీస ధర రూ. కోటి. ఫామ్‌లో ఉన్న ఈ బౌలర్‌ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రసిద్ధ్‌ కృష్ణని ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.

అవేశ్‌ఖాన్‌..

గతేడాది దిల్లీ బౌలర్‌ అవేశ్‌ఖాన్ అదరగొట్టాడు. 2021లో 16 మ్యచ్‌లు ఆడిన ఇతడు 24 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ యువ బౌలర్‌ 2017లో బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన అవేశ్‌ఖాన్‌ 29 వికెట్లు పడగొట్టాడు. ఈ వేలంలో అతడి కనీస ధర రూ. 20 లక్షలు. అయితే రూ.3 కోట్ల వరకు ఇతడు ధర పలకొచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని