IND vs SL: తేలిపోయిన భారత బ్యాట్స్‌మెన్‌.. లంక ముందు మోస్తరు లక్ష్యం

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లంక స్పిన్నర్లు అఖిల ధనంజయ 3/44, జయవిక్రమ 3/59 చెలరేగడంతో భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది....

Updated : 23 Jul 2021 20:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లంక స్పిన్నర్లు అఖిల ధనంజయ 3/44, జయవిక్రమ 3/59 చెలరేగడంతో భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని మ్యాచ్‌ అధికారులు 47 ఓవర్లలో 227గా నిర్ణయించారు. భారత బ్యాట్స్‌మెన్‌లో పృథ్వీ షా (49; 49 బంతుల్లో 8x4), సంజూ శాంసన్‌ (46; 45 బంతుల్లో 5x4, 1x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (40; 37 బంతుల్లో 7x4) ఫర్వాలేదనిపించారు. చివర్లో రాహుల్‌ చాహర్‌ (13), నవ్‌దీప్‌ సైని (15) తొమ్మిదో వికెట్‌కు 29 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ సిరీస్‌లో తొలిసారి టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(13) త్వరగా పెవిలియన్‌ చేరాడు. చమీరా బౌలింగ్‌లో అతడు ఔటయ్యేటప్పటికి జట్టు స్కోర్‌ 28. ఆపై జోడీ కట్టిన పృథ్వీషా, సంజూ శాంసన్‌ నిలకడగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే పృథ్వీ అర్ధ శతకానికి ఒక్క పరుగు దూరంలో శనక బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత్‌ 102 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే సంజూ సైతం అర్ధశతకానికి ముందు జయవిక్రమ బౌలింగ్‌లో బౌండరీ బాదబోయి ఫెర్నాండో చేతికి చిక్కాడు. తర్వాత సూర్యకుమార్‌‌, మనీశ్‌ పాండే (11) బ్యాటింగ్‌ చేస్తుండగా 23 ఓవర్లు పూర్తయ్యాక మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా సుమారు 45 నిమిషాలు ఆట నిలిచిపోయింది. అప్పటికి భారత్‌ స్కోర్‌ 147/3గా ఉంది.

అయితే, వర్షం అనంతరం ఆట తిరిగి ప్రారంభమయ్యాక లంక బౌలర్లు చెలరేగిపోయారు. దాంతో భారత్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 38 పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోయి నిరాశపర్చింది. దాంతో 32.5 ఓవర్లకు జట్టు స్కోర్‌ 195/8గా నమోదైంది. మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య (19), సూర్యకుమార్‌ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ (2), నితీశ్‌ రాణా (7) విఫలమయ్యారు. అయితే, 34వ ఓవర్‌ నుంచి బ్యాటింగ్‌ కొనసాగించిన రాహుల్‌ చాహర్‌ (13), నవ్‌దీప్‌ సైని (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 29 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే చివరికి 42, 43 ఓవర్లలో ఒకరి తర్వాత ఒకరు ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని