WTC Finals: కోహ్లీసేన దూకుడు తగ్గిస్తే మంచిది

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా ఆచితూచి ఆడాలని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. నియంత్రిత దూకుడు మాత్రమే అవసరమని సూచించారు. ఇంగ్లాండ్‌లో వాతావరణం నిమిషాల వ్యవధిలో మారుతుందన్నారు. అందుకే ఒక్కో సెషన్‌ లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు.

Published : 30 May 2021 01:37 IST

ఒక్కో సెషన్‌ బట్టి ఆడాలన్న కపిల్‌ దేవ్‌

దిల్లీ: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా ఆచితూచి ఆడాలని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. నియంత్రిత దూకుడు మాత్రమే అవసరమని సూచించారు. ఇంగ్లాండ్‌లో వాతావరణం నిమిషాల వ్యవధిలో మారుతుందన్నారు. అందుకే ఒక్కో సెషన్‌ లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు. వ్యూహాత్మకంగా, సాంకేతికంగా మెరుగ్గా ఆడాలని పేర్కొన్నారు. రిషభ్ పంత్‌లో పరిణతి కనిపిస్తోందని వెల్లడించారు.

‘టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ విభాగం అద్భుతంగా ఉంది. పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారన్నదే కీలకం. నా వరకైతే కోహ్లీసేన బ్యాటింగే అతి ముఖ్యమైంది. ఈ మధ్య కాలంలో బౌలర్లు తిరుగులేని విధంగా ఆడుతున్నారు. అందుకే బ్యాట్స్‌మెన్‌ నాణ్యతను బట్టే ఫైనల్‌లో గెలుపోటములు ఉంటాయి. టెస్టు క్రికెట్‌ అంటేనే సెషన్లు. ఇంగ్లాండ్‌లో నిమిషాల్లోనే ఎండలు కాస్తున్న ఆకాశం మేఘావృతం అవుతుంది. అందుకే సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బాగా ఆడాలి’ అని కపిల్‌ అన్నారు.

‘కోహ్లీ రాణించాలని కోరుకుంటున్నా. సహజంగానే అతడు దేనికైనా అలవాటు పడతాడు. అతి దూకుడు మాత్రం వద్దంటాను. ఒక్కో సెషన్‌ను బట్టి అతడు వ్యూహాలు రచించాలి. ఆధిపత్యం కొనసాగించేందుకు అవకాశాల కోసం ఎదురు చూడాలి. ఓపికగా ఉంటే పరుగులు వస్తాయి. ఇంగ్లాండ్‌లో బంతి స్వింగ్‌ అవుతుంది. కాబట్టి ఆదిలోనే షాట్లు ఆడొద్దు. సహనంతోనే ఇంగ్లాండ్‌లో పరుగులు వస్తాయి. ఇక పంత్‌ క్రీజులో నిలదొక్కుకొని ముందుగా పరిస్థితులకు అలవాటు పడాలి. ఆ తర్వాతే దూకుడు ప్రదర్శించాలి. రెండు, మూడు మ్యాచ్‌లు ఉంటే ఫైనల్స్‌కు మరింత అర్థం ఉండేది. లార్డ్స్‌లో నిర్వహిస్తే బాగుండేది. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదు’ అని కపిల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని