స్పిన్‌ బౌలింగ్‌కు కీపింగ్‌.. ఆ ముగ్గురిలో ధోనీకే ప్రాధాన్యత: అశ్విన్‌

టీమ్‌ఇండియాకు ప్రధాన బలం స్పిన్‌ బౌలింగ్‌. పిచ్‌ను బట్టి ఒక్కోసారి బౌన్స్‌తో బంతి....

Published : 17 Dec 2021 18:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియాకు ప్రధాన బలం స్పిన్‌. పిచ్‌ను బట్టి ఒక్కోసారి బౌన్స్‌తో బంతి దూసుకొస్తుంది. మరోసారి అనుకోని విధంగా టర్నింగ్‌ అవుతూ బ్యాటర్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరి అలా ముప్పుతిప్పలు పెట్టిస్తూ గింగరాలు తిరిగే బంతులను వికెట్ల వెనుక ఉండి పట్టేయాలంటే ఎంతో నేర్పు ఉండాలి. అలాంటి మెరికల్లాంటి ముగ్గురు కీపర్లను ఎంచుకున్నాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. తన క్రికెట్‌ కెరీర్‌లో భారత మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ, సీనియర్‌ వికెట్‌ కీపర్లు దినేశ్‌ కార్తిక్, వృద్ధిమాన్‌ సాహా వికెట్ల వెనుక అద్భుత నైపుణ్యంతో కీపింగ్‌ చేశారని అశ్విన్‌ పేర్కొన్నాడు. 

‘‘వికెట్ల వెనుక ధోనీ, కార్తిక్, సాహాల ప్రదర్శనను వేర్వేరుగా చూడటం చాలా కష్టమైన పని. అయితే నా తొలి ప్రాధాన్యత మాత్రం ఎంఎస్ ధోనీకే. క్లిష్ట పరిస్థితుల్లోనూ చాలా సులువుగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. తమిళనాడు జట్టు కోసం దినేశ్ కార్తిక్‌తో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడా. స్టంప్స్‌ వెనుక కార్తిక్ చాలా కష్టపడతాడు. అలానే సాహాను తక్కువ అంచనా వేయలేం. అయితే ఒకరినే ఎంచుకోవాలంటే మాత్రం ధోనీ వైపే మొగ్గు చూపుతా. బ్యాటర్లను ఔట్‌ చేయడంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోడు. ధోనీ వికెట్ల వెనుక ఉన్నాడంటే ఎంతటి కఠినమైన ఔట్‌ అయినా సరే చాలా తేలిగ్గా చేసేస్తాడు’’ అని అశ్విన్‌ వివరించాడు. 

బౌన్సీ, టర్నింగ్‌ పిచ్‌ మీద ధోనీ ఎంత సులువుగా స్టంప్‌ ఔట్‌ చేస్తాడో అశ్విన్‌ ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోనీ కీపింగ్‌ ప్రదర్శన అద్భుతం. పిచ్‌ మీద అంతగా టర్న్‌ లేదు కానీ బాగా బౌన్స్‌ అవుతుంది. తొలి రోజు ఆసీస్‌ బ్యాటర్‌ ఎడ్‌ కొవాన్‌ను స్టంప్‌ ఔట్‌ చేసిన విధానం మరిచిపోలేనిది. ఒక్కసారిగా బౌన్స్‌ అయిన బంతిని అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. దానిని స్టంపౌట్‌గా మార్చడం ఇంకా సూపర్‌. ధోనీ వికెట్ల వెనుక బంతిని వదిలేయడం అరుదుగానైనా చూడలేదు’’ అని అశ్విన్‌ తెలిపాడు. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని