Team India For Asia Cup 2023: ఆసియా కప్‌లో భారత ‘బలగం’.. అదరగొట్టేదెవరు?
ఆసియా కప్‌లో (Asia Cup 2023) తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో భారత్ (IND vs PAK) ఢీకొట్టనుంది. మొత్తం 17 మందితో కూడిన స్క్వాడ్‌లో కేఎల్ రాహుల్ మాత్రమే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులోఉండడు. సూపర్ -4 దశ నుంచి జట్టుతోపాటు చేరిపోయే అవకాశం ఉంది.
వన్డే ప్రపంచ కప్ ముంగిట.. ఆసియాలోని టాప్ దేశాలు తలపడే మినీ టోర్నీ ఆసియా కప్ (Asia Cup 2023) సంబురం ప్రారంభమైంది. సెప్టెంబర్ 2న శనివారం పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను షురూ చేశారు. ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత స్క్వాడ్‌లోని ఆటగాళ్ల ఫామ్ ఎలా ఉందంటే?
బ్యాటింగ్‌లో వీరే కీలకం..
- రోహిత్ శర్మ: భారత కెప్టెన్‌గా ఆసియా కప్‌లో జట్టును నడిపించనున్న రోహిత్ శర్మ క్రీజ్‌లో కుదురుకుంటే చాలు భారీ ఇన్నింగ్స్‌లు ఆడేస్తాడు. ఆసియా కప్‌లో అతడి గత గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. గత పది వన్డేల్లో రోహిత్ ప్రదర్శన మరీ గొప్పగా లేదు.. అలాగని తీసేయలేని పరిస్థితి. ఇదే ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (101) సాధించాడు. అలాగే ఇటీవల పది మ్యాచుల్లో మరో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక టెస్టుల్లో అయితే, విండీస్ పర్యటనలో సెంచరీ, రెండు అర్ధశతకాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
- విరాట్ కోహ్లీ: మ్యాచ్‌లను ముగించడంలో విరాట్ కోహ్లీని మించినవారు లేరు. మరీ ముఖ్యంగా ఛేదనలో అలవోకగా పరుగులు సాధించగల సత్తా ఉన్న ఆటగాడు. ఈసారి ఆసియా కప్‌తోపాటు వన్డే ప్రపంచకప్‌లోనూ కీలకంగా మారతాడని అంతా భావిస్తున్నారు. కానీ, అతడి గణాంకాలు మాత్రం నిరుత్సాహపరిచేలా ఉన్నాయి. గత ఎనిమిది వన్డేల్లో కేవలం ఒక్క సెంచరీ, హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. అయితే, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన అనుభవం తప్పకుండా ఆసియా కప్‌లో అక్కరకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు విరాట్ ఫామ్ మాత్రం ఉన్నతస్థితిలోనే ఉంది. విండీస్‌తో టెస్టు సిరీస్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరిగిన సుదీర్ఘ ఫార్మాట్‌లో రెండు సెంచరీలు సాధించాడు.
- శుభ్‌మన్ గిల్: రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉన్న గిల్ కాస్త నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. అయితే, ఇటీవల విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కీలకమైన ఇన్నింగ్స్ (85 పరుగులు) ఆడి ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. అడపాదడపా విఫలమవుతున్నా.. ఇదే ఏడాదిలో గిల్ అద్భుతమైన రికార్డులను సాధించాడు. న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ, శతకం బాదిన గిల్.. శ్రీలంకపైనా సెంచరీతో విరుచుకుపడ్డాడు. గత పది వన్డే మ్యాచుల్లో ఒక ద్విశతకంతోపాటు రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
- శ్రేయస్ అయ్యర్: నంబర్ -4 సమస్యను తీరుస్తాడని ఆశలు పెట్టుకున్నది శ్రేయస్ అయ్యర్‌పైనే. గాయం కారణంగా దాదాపు ఏడున్నర నెలల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన శ్రేయస్ ఎలా రాణిస్తాడనే ఆసక్తికరంగా మారింది. కీలకమైన నాలుగో స్థానంలో శ్రేయస్ ఆడతాడనే ప్రచారం సాగుతోంది. అయితే, అతడి రికార్డును గమనిస్తే మాత్రం మంచి గణాంకాలే నమోదు చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో నాలుగోస్థానంలోనే వచ్చి కీలక పరుగులు సాధించాడు. గత పది వన్డే ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధశతకాలే ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లో నిలకడగా ఆడాడు.
- కేఎల్ రాహుల్: వన్డేల్లోనూ టెస్టు ఫార్మాట్‌లా సాగదీసి ఆడాడనే విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్‌కు ఆసియా కప్‌లో చోటు దక్కడం భిన్న స్వరాలు వినిపించాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే అతడిని తీసుకున్నారనే వాదనా ఉంది. దానికి తగ్గట్టుగానే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో హాఫ్ సెంచరీ సాధించినా.. మరీ ఎక్కువ బంతులను తీసుకుని ఆడాడనే విమర్శలకు గురికాక తప్పలేదు. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 103 బంతులను ఆడి 64 పరుగులే సాధించాడు. ఇప్పుడు ఆసియా కప్‌లో ఆడే అవకాశం లభించి.. మునుపటి ఆటతీరునే ప్రదర్శిస్తే మాత్రం వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కావడం కష్టమే అవుతుంది.
- ఇషాన్ కిషన్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ ఘనత సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం కంగారు పడకుండా పరుగులు సాధించగల ప్లేయర్. నిలకడగా, దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో మొత్తం 17 వన్డేలు మాత్రమే ఆడిన ఇషాన్.. ఒక డబుల్ సెంచరీతోపాటు (210) ఆరు అర్ధశతకాలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై కేవలం 131 బంతుల్లోనే 210 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో రాణించగల సత్తా ఉన్న ఇషాన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ఏ స్థానంలో ఆడిస్తుందో చూడాలి. కేఎల్ రాహుల్ రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయం.
- సూర్యకుమార్ యాదవ్: టీ20ల్లో టాప్ బ్యాటర్. భారత ‘మిస్టర్ 360’గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం తీవ్ర నిరుత్సాహపరిచాడు. గత పది మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల్లో తొలి బంతికే ఔటయ్యాడు. అయితే, విండీస్‌తో జరిగిన మ్యాచుల్లో మాత్రం తన ‘టీ20’ ఫార్మాట్ గేమ్‌తో పరుగులు సాధించాడు. ఆసియా కప్‌లో తుది జట్టులో ఆడే అవకాశం రావడం చాలా కష్టమే. రిషభ్ పంత్ లేకపోవడం వల్ల మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్ లోటును తీర్చే బాధ్యతను సూర్యకుమార్‌కు అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చివరి 15 ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తే మాత్రం జట్టుకు అదనపు బలంగా మారతాడు.
- తిలక్ వర్మ: వన్డేలకు కొత్త. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఘనంగా అడుగు పెట్టాడు. విండీస్‌తో టీ20 సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన తిలక్ మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లో విఫలమైనప్పటికీ ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఎడమచేతివాటం బ్యాటర్ కావడం అతడికి కలిసొచ్చే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో దూకుడుగా పరుగులు చేస్తాడు. ఆసియా కప్‌లో రాణిస్తే మాత్రం వరల్డ్ కప్‌నకు మార్గం వేసుకున్నట్లే. సీనియర్ ఆటగాళ్లు మాత్రం టోర్నీల్లో డెబ్యూ చేయించవద్దని చెబుతున్న వేళ.. టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.
ఆల్‌రౌండర్ల పాత్ర కీలకం..
- హార్దిక్ పాండ్య: 1983 వరల్డ్ కప్‌లో కపిల్ సారథ్యంలోని భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 2011లోనూ టీమ్‌ఇండియా గెలవడానికి ప్రధాన ఆటగాళ్లలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా ఉంటారు. ఎందుకంటే వీరంతా ఇటు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటారు. ఇప్పుడు భారత్ ఆడనున్న ఆసియా కప్‌తోపాటు వచ్చే వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషిస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే, పూర్తిస్థాయిలో బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పాండ్య ఈసారి ఎలా రాణిస్తాడో చూడాలి. ఇటీవల విండీస్ పర్యటనలో మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశమే.
- శార్దూల్ ఠాకూర్: పేస్ ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యకు బ్యాకప్‌గా శార్దూల్‌ను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. ఇటీవల విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఠాకూర్ కావడం విశేషం. మూడు మ్యాచుల్లో ఎనిమిది వికెట్లు తీశాడు. నిలకడైన ప్రదర్శన చేస్తున్న శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో అవకాశం రావడం కష్టమే. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌తోపాటు స్పిన్నర్ రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చే అవకాశాలే ఎక్కువ.
- రవీంద్ర జడేజా: భారత టాప్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవల ఐపీఎల్‌లో సీఎస్‌కేను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి జట్టుకు అండగా నిలవడం జడేజా స్పెషాలిటీ. ఆరు లేదా ఏడో డౌన్‌లో వచ్చి విలువైన పరుగులు చేయడంతోపాటు పది ఓవర్ల కోటాలో కనీసం రెండు వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. ఇటీవల విండీస్ పర్యటనలో ఉత్తమ ప్రదర్శన చేశాడు. గణాంకాలతో సంబంధం లేకుండా జట్టు అవసరానికి తగ్గట్టు ఆడే క్రికెటర్లలో రవీంద్ర జడేజా ఒకడు. గతంలో యువీ, రైనా పోషించిన పాత్ర ఈసారి జడేజాదే అనడంలో సందేహం లేదు.
- అక్షర్ పటేల్: ఎడమ చేతివాటం కలిగిన అక్షర్ పటేల్ గత పది వన్డేల్లో ప్రదర్శన చూస్తే జట్టులోకి రావడం గొప్ప విషయమే. అయితే, రవీంద్ర జడేజాకు బ్యాకప్‌గా మాత్రమే అతడిని తీసుకున్నట్లు అనిపిస్తోంది. లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు సాధించగల సత్తా అక్షర్‌కు ఉంది. ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దిగే సమయంలోనే అతడికి తుది జట్టులో అవకాశం లభించనుంది. ఇటీవల విండీస్ పర్యటనలో ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడినా.. అందులో విఫలమయ్యాడు. అయితే, ఇదే ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో విలువైన పరుగులు చేశాడు.
బౌలర్లు వీరే..
- జస్ప్రీత్ బుమ్రా: దాదాపు ఏడాది తర్వాత ఐర్లాండ్ సిరీస్‌తో మైదానంలోకి అడుగు పెట్టిన బుమ్రాపై ఈ టోర్నీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఐర్లాండ్‌తో టీ20ల్లో బరిలోకి దిగిన బుమ్రా ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి వినియోగించుకున్నాడు. ఇప్పుడు ఆసియా కప్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడం వల్ల వన్డే ప్రపంచ కప్ ముంగిట ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం దొరికినట్లే. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌లో బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.
- మహమ్మద్ సిరాజ్: ఈ హైదరాబాదీ బౌలర్ ఇటీవల సీనియర్లు బుమ్రా, షమీ లేని లోటును తీరుస్తూ ప్రధాన బౌలర్‌గా మారాడు. ఇప్పటివరకు మొత్తం కెరీర్‌లో 24 వన్డేలను మాత్రమే ఆడిన సిరాజ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడీ ఆసియా కప్‌లో బుమ్రా, షమీకి తోడుగా పేస్ బౌలింగ్‌ను పంచుకునే అవకాశాలు సిరాజ్‌కే ఉన్నాయి. ఒకవేళ ఇద్దరు ప్రధాన పేసర్లతోపాటు పేస్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగాలని భావిస్తే మాత్రం షమీ కంటే సిరాజ్ వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
- మహమ్మద్ షమీ: ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నీల కోసం షమీని విండీస్‌తో పర్యటనకూ ఎంపిక చేయకుండా విశ్రాంతి ఇవ్వడం జరిగింది. సీనియర్ బౌలర్ అయిన షమీకి కీలక వికెట్లు తీసి జట్టుకు అండగా నిలవగల సత్తా ఉంది. చివరిసారిగా షమీ ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. అందులోనూ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలోనూ నిలిచాడు. ఆసీస్‌తో సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో 15 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టాడు.
- ప్రసిధ్ కృష్ణ: ఆడిన అనుభవం తక్కువే అయినా ప్రభావం చూపించగల బౌలర్. అయితే, బుమ్రా మాదిరిగానే గాయం నుంచి కోలుకుని ఇటీవలే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికై నాణ్యమైన ప్రదర్శన ఇచ్చాడు. రెండు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో ఆసియా కప్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 14 వన్డేలు ఆడిన ప్రసిధ్ కృష్ణ 25 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్‌పై 4/12 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అయితే, ముగ్గురు సీనియర్ పేసర్లతోపాటు ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు ఉండటంతో తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందా..? అనేది సందేహంగానే ఉంది.
- కుల్‌దీప్ యాదవ్: జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్. ఇటీవల విండీస్ పర్యటనలో అదరగొట్టేయడంతో ఆసియా కప్ ఆడే అవకాశం వచ్చింది. యుజ్వేంద్ర చాహల్ వంటి మణికట్టు మాంత్రికుడిని కూడా పక్కన పెట్టి మరీ కుల్‌దీప్ యాదవ్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. విండీస్ పర్యటనలో మూడు మ్యాచుల్లోనూ ఆడిన కుల్‌దీప్ 19 ఓవర్లు వేసి ఏడు వికెట్లు తీశాడు. ఆ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ కుల్‌దీప్ కావడం విశేషం. తన ‘చైనామన్’ బౌలింగ్‌తో ఆసియా కప్‌లోనూ రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్‌మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
-
New Words: ఫిన్స్టా.. గర్ల్‌బాస్.. షెఫ్స్ కిస్.. ‘జెనరేషన్ జడ్’ సరికొత్త పదాలు డిక్షనరీలోకి!