T20 World Cup: అఫ్గానే కానీ.. తేలిక కాదు

అఫ్గానిస్థాన్‌తో భారత్‌ మ్యాచ్‌ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం! కానీ ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో ఇటీవలే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అందరూ చూశారు.

Updated : 20 Jun 2024 07:10 IST

సూపర్‌-8లో భారత్‌ తొలి పోరు నేడు
బ్రిడ్జ్‌టౌన్‌

అఫ్గానిస్థాన్‌తో భారత్‌ మ్యాచ్‌ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం! కానీ ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో ఇటీవలే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అందరూ చూశారు. కివీస్‌ లాంటి పెద్ద జట్టును ఏకంగా 84 పరుగుల తేడాతో చిత్తు చేయడం అఫ్గాన్‌ ప్రతిభకు, ఎదుగుదలకు నిదర్శనం. ఈ నేపథ్యంలో గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌లో రోహిత్‌ సేన జాగ్రత్తగా ఆడాల్సిందే. అఫ్గానే కదా అని తేలిగ్గా తీసుకోకుండా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే సూపర్‌-8ను ఘనంగా ఆరంభించినట్లే.

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. తొలి దశను సులువుగానే దాటేసిన రోహిత్‌ సేనకు.. సూపర్‌-8లో సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. పేరుకు చిన్న జట్టే అయినా గ్రూప్‌ దశలో అదరగొట్టిన అఫ్గానిస్థాన్‌తో గురువారం తన తొలి సూపర్‌-8 మ్యాచ్‌ ఆడబోతోంది భారత్‌. చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో చిత్తయినా.. అంతకుముందు అఫ్గాన్‌ సాధించినవి మామూలు విజయాలు కావు. ముఖ్యంగా బలమైన న్యూజిలాండ్‌ను పోటీలో లేకుండా చేసిందా జట్టు. ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో కనిపిస్తున్న అఫ్గాన్‌తో రోహిత్‌సేన కచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. గ్రూప్‌ దశలో భారత్‌కు ఓటమే లేకపోయినా.. బౌలింగ్‌ పిచ్‌లపై బ్యాటర్ల తడబాటు, ముఖ్యంగా కోహ్లి వైఫల్యం కొంత ఆందోళన రేకెత్తించింది. మరి సూపర్‌-8 మ్యాచ్‌లో కోహ్లి, మిగతా బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.


పిచ్‌.. వాతావరణం?

బ్రిడ్జ్‌టౌన్‌ పిచ్‌ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడ జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 200 పైచిలుకు స్కోరు చేసింది. దీంతో పాటు మరో రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు కూడా బాగానే రాణించారు. ఆరంభంలో పేస్‌కు సహకారం అందుతుంది. తర్వాత స్పిన్నర్లూ ప్రభావం చూపుతారు. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే పెద్ద స్కోర్లు చేయొచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు.


కుల్‌దీప్‌కు ఛాన్సుందా?

చక్కటి ఫామ్‌తో ప్రపంచకప్‌లో అడుగు పెట్టినప్పటికీ.. గ్రూప్‌ దశలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌. సూపర్‌-8లో అయినా అతడిని ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టోర్నీలో ఇప్పటిదాకా ఎలాంటి ప్రభావం చూపలేదు. బ్యాటింగ్‌లో అతడిపై ఆధారపడాల్సిన అవసరం జట్టుకు ఉండకపోవచ్చు కాబట్టి స్పెషలిస్టు స్పిన్నర్‌ అయిన కుల్‌దీప్‌ను ఆడిస్తే జట్టుకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ నిలకడగానే బౌలింగ్‌ చేస్తున్నాడు.


కోహ్లి అందుకుంటాడా?

గ్రూప్‌ దశలో తేలిపోయిన విరాట్‌ కోహ్లి.. కీలకమైన సూపర్‌-8 దశ నుంచి తన బ్యాట్‌ పదును చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. 1, 4, 0.. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లో కోహ్లి స్కోర్లు ఇవి. ఈసారి లెక్కలన్నీ సరి చేసేలా విరాట్‌ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్‌తో కలిసి రోహిత్‌ ఎలాంటి ఆరంభం అందిస్తాడన్న దానిపైనే మ్యాచ్‌ గమనం ఆధారపడి ఉంటుంది. ఫామ్‌లో ఉన్న పంత్, సూర్యకుమార్‌ల నుంచి జట్టు పెద్ద స్కోర్లు ఆశిస్తోంది. బౌలింగ్‌ పిచ్‌లపై తడబడ్డ దూబె.. ఈ మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగుతాడేమో చూడాలి. మిడిలార్డర్లో హార్దిక్‌ పాండ్య కీలకం. గ్రూప్‌ దశలో అదరగొట్టిన పేస్‌ ద్వయం బుమ్రా, అర్ష్‌దీప్‌లపై మంచి అంచనాలున్నాయి.సిరాజ్‌ నుంచి మరింత నిలకడ ఆశిస్తోంది జట్టు.


జరభద్రం

అఫ్గానిస్థాన్‌ను ఏ పెద్ద జట్టు కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదిప్పుడు. బ్యాటింగ్, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ ఆ జట్టులో ప్రతిభావంతులకు లోటు లేదు. బ్యాటింగ్‌లో గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నైబ్‌ ఆ జట్టుకు ఎంతో కీలకం. నైబ్‌ టోర్నీలో మంచి ఫామ్‌ కనబరిచాడు. బౌలింగ్‌లో ఫారూఖీ, నవీనుల్, రషీద్‌ ఖాన్, నూర్‌ అహ్మద్‌ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. రషీద్‌ ఇటీవల గొప్పగా రాణించకపోయినా.. అతణ్ని భారత బ్యాటర్లు తక్కువగా అంచనా వేయరు. అజ్మతుల్లా, నబి, కరీమ్‌ జనత్‌ లాంటి ఆల్‌రౌండర్లు జట్టు బలాన్ని పెంచేవారే. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే.. రషీద్, నబి, నూర్‌లతో భారత బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంటుంది.


కష్టాలు తీరినట్లేనా?

టీ20 ప్రపంచకప్‌లో తన గ్రూప్‌ దశ మ్యాచ్‌లన్నీ భారత్‌ న్యూయార్క్‌లోనే ఆడింది. అక్కడి డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు బ్యాటర్లకు చుక్కలు చూపించేశాయి. వంద పైచిలుకు స్కోర్లు చేయడం, వాటిని ఛేదించడం కూడా కష్టమెంiది ఆ పిచ్‌లపై. అయితే సూపర్‌-8 నుంచి బ్యాటర్లకు ఈ తంటాలు లేనట్లే. మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లోనే జరగనున్నాయి. భారత్‌-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న బ్రిడ్జ్‌టౌన్‌ మైదానం పిచ్‌ సమతూకంతో ఉంటుంది. ఇక్కడ నిలదొక్కుకుంటే బ్యాటర్లు భారీ స్కోర్లు చేయొచ్చు. షాట్లు ఆడేందుకు ఇబ్బంది ఉండదు. కాబట్టి భారత బ్యాటర్లు సహజ శైలిలో ఆడేందుకు అవకాశం లభిస్తుంది.


‘‘ఎవరినైనా పక్కన పెట్టడం కష్టమైన పనే. న్యూయార్క్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలించింది. ఇక్కడ (బార్బడోస్‌) పరిస్థితులు వేరు. చాహల్, కుల్‌దీప్‌లలో ఒకరిని ఆడిస్తాం’’

ద్రవిడ్‌


తుది జట్లు (అంచనా)..

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్, జడేజా/కుల్‌దీప్, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా, సిరాజ్‌.

అఫ్గానిస్థాన్‌: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నైబ్, అజ్మతుల్లా, నజీబుల్లా, నబి, కరీమ్‌ జనత్, రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), నూర్‌ అహ్మద్, నవీనుల్, ఫారూఖీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని