IND vs BAN: బంగ్లాతో పోరు.. గెలిస్తే భారత్‌ సెమీస్‌కే..!

టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 పోరులో భారత్‌ మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఆంటిగ్వా వేదికగా శనివారం బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది.

Updated : 21 Jun 2024 14:50 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్‌ జోరు కొనసాగుతోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియా మరో కీలక పోరులో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌దే ఆధిపత్యం అయినప్పటికీ.. తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు క్రికెట్‌ విశ్లేషకులు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమవుతుంది.

  • బంగ్లాతో మ్యాచ్‌ అంటే 2018 నిదహాస్ ట్రోఫీ గుర్తుకొస్తుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్‌ను బంగ్లా ఓడించినంత పని చేసింది. సీనియర్‌ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌ అదరగొట్టేయడంతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. 
  • భారత్ - బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు 13 టీ20ల్లో తలపడ్డాయి. ఒక్కసారి మాత్రమే బంగ్లా గెలవగా.. 12 మ్యాచుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. గత పొట్టి కప్‌లోనూ భారత్‌ నెగ్గింది.
  • బంగ్లాదేశ్‌ జట్టులో కెప్టెన్ షాంటో, సీనియర్‌ ఆటగాళ్లు షకిబ్ అల్ హసన్, మహమ్మదుల్లా, రిషద్, లిటన్ దాస్, తౌహిద్, తన్జిద్‌, ముస్తాఫిజుర్ కీలకం. స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌లపై షకిబ్, రిషద్‌ను అడ్డుకుంటే మ్యాచ్‌ను సగం లాగేసుకున్నట్లే. 
  • టీ20ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బంగ్లాపై అద్భుతంగా ఉంది. 12 ఇన్నింగ్స్‌ల్లో 141 స్ట్రైక్‌రేట్‌తో 454 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధశతకాలు ఉన్నాయి.
  • భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ తొలిసారి ఈ వరల్డ్‌ కప్‌లో రెండంకెల స్కోరును సాధించాడు. అఫ్గాన్‌పై విలువైన 24 పరుగులు చేశాడు. 
  • గత పొట్టి కప్‌లోనూ బంగ్లాపై హాఫ్‌ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. ఇక కెప్టెన్ రోహిత్ కూడా శుభారంభాలను అందిపుచ్చుకుంటే భారత్‌కు తిరుగుండదు. 
  • స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్య పేస్‌ బౌలింగ్‌ను నడిపిస్తున్నారు. అఫ్గాన్‌ను ఓడించడంలో వీరిదీ కీలకపాత్రే. బుమ్రా, అర్ష్‌దీప్‌ 6 వికెట్లు పడగొట్టారు.
  • స్పిన్‌ కోటాలో స్పెషలిస్ట్‌గా తొలిసారి బరిలోకి దిగిన కుల్‌దీప్‌ రెండు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా కట్టుదిట్టంగా బంతులేశారు.
  • భారత తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్న శివమ్‌ దూబె స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకుల సూచన. 
  • ఆంటిగ్వా వేదికను అంచనా వేయడం చాలా కష్టం. లీగ్‌ స్టేజ్‌లో బౌలింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై.. సూపర్‌-8లో మాత్రం బ్యాటర్లకు సహకారం లభిస్తోంది. అందుకు ఉదాహరణ.. యూఎస్‌ఏ-దక్షిణాఫ్రికా మ్యాచ్‌. తొలుత సఫారీ జట్టు 194/4 స్కోరు చేయగా.. యూఎస్‌ఏ కూడా 176/6 వరకు రాగలిగింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని