IND vs SL: శ్రీలంకతో రెండో టీ20.. ఈసారి భారత టాప్‌ఆర్డర్‌ ఆడాల్సిందే..!

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ శుభారంభం చేసింది. అయితే మిడిలార్డర్‌తోపాటు బౌలింగ్‌లో యువకులు రాణించడంతో కేవలం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది.

Published : 05 Jan 2023 01:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విజయంతో టీమ్‌ఇండియా(team india) కొత్త సంవత్సరం ప్రారంభించింది. ‘మిషన్  - 2024’లో భాగంగా స్వదేశం వేదికగా శ్రీలంక(Ind vs SL)తో టీ20 సిరీస్‌(T20 series)ను ఆడుతోంది. అయితే తొలి మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. గతంలో మాదిరిగా ఆధిపత్యం ప్రదర్శించడంలో మాత్రం విఫలమైంది. ప్రత్యర్థి శ్రీలంకను తక్కువగా అంచనా వేయడంలేదు కానీ.. టీమ్‌ఇండియా తన బలహీనతలను మరోసారి బయటపెట్టుకుంది. మరి తొలి టీ20లో జరిగిన లోపాలేంటి? రెండో మ్యాచ్‌లో సరిచేసుకోవాల్సిన అంశాలంటో చూద్దాం..!

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుణె వేదికగా గురువారం రెండో మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌ జరిగిన వాంఖడే స్టేడియం(Wankhede Stadium) బ్యాటింగ్‌కు అనుకూలమని క్రికెట్‌ విశ్లేషకుల అంచనా. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. తీరా చివరికి వచ్చేసరికి 162/5 స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. ముగ్గురు కీలకమైన బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. 

ఆ ఒక్కడు మినహా మిగతా టాప్‌ఆర్డర్‌ విఫలం

టీ20ల్లో భారీ స్కోరు సాధించాలంటే ఓపెనర్లతోపాటు టాప్‌ ఆర్డర్‌ రాణించడం చాలా ముఖ్యం. అయితే లంకతో తొలి మ్యాచ్‌లో మాత్రం ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan) (37) మినహా టాప్‌ - 4లోని ముగ్గురు బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి మ్యాచ్‌ ఆడిన శుబ్‌మన్‌ గిల్(Shubman Gill) (7)తోపాటు ఎన్నో అంచనాలు పెట్టుకొన్న వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) (7), అవకాశం రావడంలేదన్న కారణంతో సోషల్‌ మీడియాలో విపరీతంగా మద్దతు కూడగట్టుకొన్న సంజూ శాంసన్ (5) ఘోరంగా విఫలం కావడం భారత శిబిరాన్ని ఆందోళనకు గురయ్యేలా చేసింది. రెండో మ్యాచ్‌లోనైనా టాప్‌ ఆర్డర్‌ రాణించాల్సి అవసరం ఎంతైనా ఉంది. భారీ లక్ష్యం లేకపోతే శ్రీలంక బ్యాటర్లు తమ వైపు మ్యాచ్‌ను తిప్పేయగల సమర్థులు. తొలి టీ20ల్లోనే విజయ తీరాల వరకు వచ్చి భారత్‌ను హడలెత్తించారు. 

బౌలింగ్‌లో.. హర్షల్‌కు ఏమైంది..?

భారత పిచ్‌లు సాధారణంగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కానీ శ్రీలంకతో తొలి టీ20లో మాత్రం అనూహ్యంగా పేసర్లకు సహకరించడం గమనార్హం. అరంగేట్ర బౌలర్‌ శివమ్‌ మావి (4/22) అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు. అలాగే ఉమ్రాన్‌ మాలిక్‌ (2/27) కూడా రాణించాడు. ఈ మ్యాచ్‌లోనే భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా అవతరించాడు. అయితే హర్షల్‌ పటేల్ (2/41) వికెట్లు తీసినా.. మళ్లీ తన ‘19వ’ ఓవర్‌ ఫోబియాను కొనసాగించాడు. రెండో టీ20లో ఈ పొరపాటు పునరావృతం కాకూడదు. హార్దిక్ కూడా మూడు ఓవర్లు వేసి వికెట్‌ తీయకపోయినా 12 పరుగులే ఇచ్చాడు. ఇక అక్షర్ పటేల్ (0/31) చివరి ఓవర్‌లో భారత్‌ను గెలిపించాడు. కానీ బౌలింగ్‌ ఏమీ గొప్పగా లేదు. అలాగే చాహల్‌ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి 26 పరుగులు సమర్పించాడు. ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో చోటు దక్కాలంటే తన మణికట్టు మాయాజలాన్ని ప్రదర్శించాల్సిందే. 

కెప్టెన్సీ అదుర్స్‌.. గాయం పరిస్థితేంటో..

ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిసారే కప్‌ను గెలిచిన హార్దిక్‌ పాండ్య.. జాతీయ జట్టుకు సారథ్యం వహించడం గతంలోనూ చూశాం. ఇప్పుడు ‘మిషన్ - 2024’లో భాగంగా టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్‌ మంచి మార్కులే కొట్టేశాడు. తొలుత బ్యాటింగ్‌లో కీలకమైన పరుగులు సాధించాడు. అలాగే అవసరమైన సందర్భంలో బౌలింగ్‌లోనూ ముందుకొచ్చి సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపాడు. ఎవరైనా ఆటగాడు పొరపాట్లు చేస్తే విసుక్కోకుండా ధైర్యం చెప్పాడు. అలాగే ఎప్పటికప్పుడు ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో మార్పులు చేస్తూ నాయకుడిగా ఆకట్టుకొన్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌ సందర్భంగా వెన్ను నొప్పికి గురికాగా.. ఫీల్డింగ్‌ సమయంలోనూ కాలి కండరాలు పట్టేయడంతో కాసేపు విలవిలాడిపోయాడు. అయితే గాయమేమీ పెద్ద సమస్య కాబోదని తొలి మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌ చెప్పాడు. కాబట్టి రెండో టీ20కి హార్దిక్‌ పూర్తి స్థాయిలో బౌలింగ్‌ వేసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని