INDW vs AUSW: సూపర్‌ ఓవర్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళల జట్టు

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత అమ్మాయిల జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌ టైగా ముగియడంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. దీంతో చెలరేగి ఆడిన భారత జట్టు విజయం సాధించి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Updated : 12 Dec 2022 00:31 IST

ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ‘సూపర్‌’ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముంబయి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ టై అయి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. దీంతో చెలరేగిన భారత అమ్మాయిలు ఆస్ట్రేలియాను చిత్తు చేశారు. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు వికెట్‌ నష్టపోయి 20 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు వికెట్‌ కోల్పోయి 16 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు  సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన భారత్ 5 వికెట్లు కోల్పోయి స్కోర్‌ సమం చేసింది. భారత్‌ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధాన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. 

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..

ఇక సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ చెలరేగి ఆడింది. స్మృతి మంధాన, రీచా ఘోష్‌ ఓపెనర్లుగా దిగారు. తొలి బంతినే ఘోష్‌ సిక్సర్‌గా మలిచింది. ఇక భారీ షాట్‌ ఆడే క్రమంలో రెండో బంతికి ఘోష్‌ ఔట్‌ అయింది. మూడో బంతికి కౌర్‌ ఒక పరుగు తీసింది. నాలుగు, ఐదు బంతులను మంధాన ఫోర్‌, సిక్స్‌గా మలిచింది. చివరి బంతికి మూడు పరుగులు వచ్చాయి. దీంతో ఆసీస్‌కు భారత్‌ 21 పరుగులు టార్గెట్‌గా నిర్దేశించింది. భారత్‌ తరఫున రేణుక బౌలింగ్‌ చేయగా తొలి బంతికి ఫోర్‌, రెండో బంతికి ఒక పరుగు  వచ్చాయి. మూడో బంతికి వికెట్‌ పడింది. నాలుగో బంతికి కేవలం ఒక పరుగే వచ్చింది. దీంతో సమీకరణం 2 బంతుల్లో15 పరుగులుగా మారింది. అప్పటికే భారత్‌ విజయం ఖరారు అయింది. ఇక చివరి బంతులకు 4, 6 వచ్చాయి. దీంతో భారత్‌ విజయం సాధించింది.       

మెరిసిన మంధాన

ఆస్ట్రేలియా నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్య చేదనకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 76 పరుగుల నమోదు చేశారు. ఈ క్రమంలో 8.4 ఓవర్ల వద్ద ధాటిగా ఆడుతున్న షపాలీ వర్మ(34: 23 బంతుల్లో) ఔట్‌ అయింది. దీంతో క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్‌ సైతం స్వల్ప తేడాతో పెవిలియన్‌ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న ఓపెనర్‌ స్మృతి మంధాన (79: 49 బంతుల్లో) వీరవిహారం చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(21)తో జట్టు కట్టి మూడో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో స్వల్ప తేడాతో 142 పరుగుల వద్ద హర్మన్‌ ప్రీత్‌కౌర్‌, 148 పరుగుల వద్ద స్మృతి మంధాన ఔట్‌ కావడంతో ఒక్కసారిగా భారత శిబిరంలో ఆందోళన చెలరేగింది. అయితే చివరలో రిచా ఘోష్‌(26 నాటౌట్‌: 13 బంతుల్లో), దేవిక వైద్య(11 నాటౌట్‌) ధాటిగా ఆడి స్కోర్‌ను సమం చేశారు. దీంతో మ్యాచ్‌ టై అయింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం ఒక వికెల్పోట్‌ కోయి 187 పరుగులు చేసింది. ఆ జట్టులో మూనీ(82 నాటౌట్‌: 54 బంతుల్లో), తహ్లియా మెక్‌గ్రాత్‌(70 నాటౌట్‌: 51 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లు ఎంత శ్రమించినప్పటికీ రెండో వికెట్‌ తీయలేకపోయారు. దీప్తి శర్మ ఒక వికెట్‌ తీసింది. 
   
  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని