INDW vs SAW: చిత్తు చేసి పంపించారు

వన్డేల్లో క్లీన్‌ స్వీప్‌.. ఏకైక టెస్టులోనూ ఘనవిజయం.. ఇప్పుడు టీ20 సిరీస్‌ సమం. మొత్తంగా దక్షిణాఫ్రికా జట్టుకు భారత పర్యటనలో సిరీస్‌ విజయమే దక్కలేదు.

Updated : 10 Jul 2024 03:02 IST

చివరి టీ20లో భారత్‌ ఘనవిజయం
84కే దక్షిణాఫ్రికా ఆలౌట్‌
పూజ, రాధ విజృంభణ

చెన్నై: వన్డేల్లో క్లీన్‌ స్వీప్‌.. ఏకైక టెస్టులోనూ ఘనవిజయం.. ఇప్పుడు టీ20 సిరీస్‌ సమం. మొత్తంగా దక్షిణాఫ్రికా జట్టుకు భారత పర్యటనలో సిరీస్‌ విజయమే దక్కలేదు. తొలి టీ20లో గెలిచి, సిరీస్‌ మీద కన్నేసిన సఫారీ జట్టుకు.. రెండో టీ20లో వరుణుడు బ్రేక్‌ వేస్తే, మూడో టీ20లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజృంభించిన హర్మన్‌ప్రీత్‌ సేన ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. మంగళవారం చెన్నైలో ఏకపక్షంగా సాగిన చివరి టీ20లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట పూజ వస్త్రాకర్‌ (4/13), రాధ యాదవ్‌ (3/6) విజృంభించడంతో దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. అరుంధతి రెడ్డి (1/14), శ్రేయాంక పాటిల్‌ (1/19), దీప్తి శర్మ (1/21) సైతం కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. తజ్మిత్‌ బ్రిట్స్‌ చేసిన 20 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. ఆమె కాకుండా బోష్‌ (17), మరిజేన్‌ కాప్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి టీ20లోనే కాక రద్దయిన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టి సఫారీ బ్యాటర్లు.. ఈసారి తేలిపోయారు. నాలుగో ఓవర్లో లారా వోల్వార్ట్‌ (9)ను ఔట్‌ చేసి శ్రేయాంక పతనానికి తెర తీయగా.. ఆ తర్వాత పూజ, రాధ సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వికెట్ల పంట పండించుకున్నారు. లక్ష్యాన్ని భారత్‌ 10.5 ఓవర్లలో ఒక్క వికెట్టూ కోల్పోకుండా ఛేదించింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన (54 నాటౌట్‌; 40 బంతుల్లో 8×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. షెఫాలి వర్మ (27 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4) కూడా నిలకడగా బ్యాటింగ్‌ చేయడంతో భారత్‌ అలవోకగా ఛేదనను పూర్తి చేసింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను హర్మన్‌ప్రీత్‌ సేన 1-1తో సమం చేసింది. అంతకుముందు మూడు వన్డేల సిరీస్‌ను    క్లీన్‌స్వీప్‌ చేయడంతో పాటు ఏకైక టెస్టులోనూ భారత్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంక్షిప్త స్కోర్లు...

దక్షిణాఫ్రికా: 84 (బ్రిట్స్‌ 20, బోష్‌ 17; పూజ 4/13, రాధ 3/6, అరుంధతి 1/14, శ్రేయాంక 1/19, దీప్తి 1/21);

భారత్‌: 88/0 (స్మృతి 54 నాటౌట్, షెఫాలి 27 నాటౌట్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని