INDw Vs SLw: అమ్మాయిలు సాధించారు.. ఆసియా కప్‌ భారత్‌ సొంతం

ఆసియా కప్‌ ట్రోఫీని భారత మహిళల జట్టు మరోసారి ఒడిసిపట్టింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. స్వల్ప లక్ష్య ఛేదనను అలవోకగా పూర్తి చేసింది. స్మృతి మంధాన అర్ధశతకంతో మెరిసింది. 

Updated : 15 Oct 2022 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌ ఆసాంతం రాణించిన భారత మహిళల జట్టు.. ఫైనల్లోనూ చెలరేగింది. ప్రత్యర్థి శ్రీలంకను చిత్తుచేసి సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. చివరి పోరులో తిరుగులేని  పై చేయి సాధించి చిరస్మరణీయ విజయం అందుకుంది. మొదట బౌలింగ్‌తో ప్రత్యర్థిని 65 పరుగులకే చుట్టేసిన అమ్మాయిల జట్టు.. ఆపై బ్యాటింగ్‌తోనూ విరుచుకుపడింది. లక్ష్యాన్ని కేవలం 8.3 ఓవర్లలోనే  ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత జట్టు ఆసియా కప్‌ను ఏడోసారి సొంతం చేసుకుంది.

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లు ఇద్దరు ఆటపట్టు (6), అనుష్క సంజీవని (2) రనౌట్లతో వెనుదిరగడంతో ఆ జట్టు వికెట్ల పతనం మొదలైంది. బౌలర్లు రేణుకా సింగ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌ ఏ బ్యాటర్‌ను కూడా క్రీజులో కుదురుకోనివ్వలేదు. ముఖ్యంగా రేణుక తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ పేస్‌తో విరుచుకుపడింది. చివర్లో ఇనోకా రణవీర (18*), ఓషాది రణసింగె (13) మాత్రమే మోస్తరుగా రాణించడంతో లంక జట్టు ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. ఈ ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతావారెవరూ క్రీజులో నిలవలేకపోయారు. రేణుక 3 వికెట్లు తీయగా.. గైక్వాడ్‌, స్నేహ్‌ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఆపై బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ఇండియా స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ముఖ్యంగా ఓపెనర్‌ స్మృతి మందాన (51*) ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడింది. 25 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించింది. ఇన్నింగ్స్‌ 32 పరుగుల వద్ద షెపాలీ వర్మ (5), ఆపై జెమీమా రోడ్రిగెజ్‌ (2) ఔటైనా.. మందానా జోరు కొనసాగించింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ (11*)తో కలిసి 9 ఓవర్లలోపే లక్ష్యాన్ని చేధించడంతో భారత శిబిరంలో సంబురాలు అంబరాన్నంటాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని