ZIM vs IND: జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Updated : 07 Jul 2024 20:11 IST

హరారె: జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమ్ఇండియా.. రెండో టీ20లో అదరగొట్టింది. హరారె వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) తన రెండో అంతర్జాతీయ టీ20లోనే సెంచరీ బాదాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (77*; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో మెరిశాడు. 235 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మద్వీర (43) టాప్ స్కోరర్‌. బ్రియాన్‌ బెనెట్ (26; 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. జాంగ్వి (33), జోనాథన్ క్యాంప్‌బెల్ (10) పరుగులు చేశారు. ఇన్నోసెంట్ కైయా (4), సికిందర్ రజా (4) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. క్లైవ్ మండాడే (0), డియోన్ మేయర్స్ (0) పరుగుల ఖాతా తెరవలేదు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11), ముకేశ్ కుమార్ (3/37) జింబాబ్వేను కట్టడి చేశారు. వాషింగ్టన్ సుందర్‌ ఒక వికెట్ పడగొట్టాడు. 

అదరగొట్టిన అభిషేక్, రుతురాజ్‌ 

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్ (2)ని ముజరబాని పెవిలియన్‌కు పంపాడు. తర్వాత అభిషేక్‌ శర్మ, రుతురాజ్‌ జోడీ మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడింది. 8 ఓవర్లకు 49/1 స్కోరుతో నిలిచిన భారత్.. 180 స్కోరు చేయడం కూడా కష్టంగా కనిపించింది. తర్వాత సెంచరీ హీరో అభిషేక్ శర్మ తొలుత నెమ్మదిగా ఆడాడు. ఒక దశలో 30 బంతుల్లో 41 పరుగులతో ఉన్న అతడు తర్వాత గేర్లు మార్చి ఆడాడు. డియోన్ మేయర్స్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4, 6, 4 బాదేశాడు. రజా వేసిన 13 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు రాబట్టాడు అభిషేక్. 

మసకద్జ వేసిన తర్వాతి ఓవర్‌లో అభిషేక్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది తన రెండో అంతర్జాతీయ టీ20లోనే సెంచరీ అందుకున్నాడు. కానీ, తర్వాతి బంతికే మేయర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 38 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న రుతురాజ్.. తర్వాత దూకుడు పెంచాడు. చటార బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4, 4 రాబట్టాడు. చివర్లో రింకు సింగ్ (48*; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. భారత్‌ చివరి 10 ఓవర్లలో 160 పరగులు రాబట్టడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని