IND vs WI : తొలి టీ20లో భారత్‌ ఘన విజయం..

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో భారత్‌ ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు..

Published : 17 Feb 2022 02:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (40) రాణించాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ రెండు, ఫేబియన్ అలెన్‌, షెల్డన్‌ కాట్రెల్‌ తలో ఒక వికెట్‌ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌కి రోహిత్‌ శర్మ (40: 19 బంతుల్లో 4×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (35: 42 బంతుల్లో 4×4) తో కలిసి  శుభారంభాన్ని అందించాడు. రోహిత్‌ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో అలరించాడు. ఈ క్రమంలోనే రోస్టన్ ఛేజ్‌ వేసిన 8వ ఓవర్లో ఒడియన్‌ స్మిత్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. అప్పటికి భారత్‌ స్కోరు 64/1 గా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇషాన్‌ కిషన్, విరాట్‌ కోహ్లీ (17) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. రిషభ్‌ పంత్ (8) విఫలమయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ (34), వెంకటేశ్‌ అయ్యర్‌ (24) నిలకడగా ఆడుతూ భారత్‌ని విజయతీరాలకు చేర్చారు.    

పూరన్ ఒక్కడే..

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భువనేశ్వర్‌ కుమార్ విండీస్‌కు షాకిచ్చాడు. ఓపెనర్‌ బ్రెండన్‌ కింగ్‌ (4) సూర్యకుమార్‌ యాదవ్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్ (61: 43 బంతుల్లో 4×4, 5×6)తో కలిసి ఓపెనర్ కైల్ మేయర్‌ (31: 24 బంతుల్లో 7×4) ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే పవర్ ప్లే పూర్తయ్యే సరికి విండీస్‌ జట్టు 44/1 స్కోరుతో నిలిచింది. ఏడో ఓవర్లో కైల్ మేయర్‌ని యుజ్వేంద్ర చాహల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత రవి బిష్ణోయ్‌ ఒకే ఓవర్లో రోస్టన్‌ ఛేజ్‌ (4), రోమన్ పొవెల్‌ (2)లను వెనక్కి పంపి విండీస్‌ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అకీల్ హోసీన్ (10) దీపక్‌ చాహర్‌కి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత నికోలస్‌ పూరన్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఒడియన్ స్మిత్ (4) ఆఖరు బంతికి  క్యాచ్‌ ఔట్ అయ్యాడు.  కీరన్‌ పొలార్డ్‌ (24) నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు రవి బిష్ణోయ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. భువనేశ్వర్‌ కుమార్, యుజ్వేంద్ర చాహల్, దీపక్‌ చాహర్‌, హర్షల్ పటేల్ తలో వికెట్‌ పడగొట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని