IND vs NZ: ఈడెన్‌లోనూ విజయమే.. టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌

మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్‌లో అన్ని రంగాల్లో..

Updated : 22 Nov 2021 04:00 IST

కోల్‌కతా: భారత క్రికెట్‌ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు శుభారంభం.. ఇన్నాళ్లూ విరాట్‌ లేనప్పుడే అప్పుడప్పుడు జట్టు పగ్గాలు చేపట్టే రోహిత్ శర్మకు టీ20 జట్టు పూర్తిస్థాయి సారథిగా తొలి సిరీస్‌ విజయం.. అదీనూ న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ (3-0) చేయడం విశేషం.

జట్టులో విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ వంటి మ్యాచ్‌ విన్నర్లు లేరు. ఉన్నదంతా ద్రవిడ్‌ మార్గదర్శకత్వం.. రోహిత్ శర్మ నాయకత్వం.. ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లు తమ సత్తాను చాటారు. హర్షల్‌ పటేల్, వెంకటేశ్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్ తమకొచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు కేన్‌ విలియమ్సన్, కాన్వే వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు లేకపోయినా.. కివీస్‌ను తక్కువ అంచనా వేయలేదు. గప్తిల్, డారిల్ మిచెల్, ఫిలిప్స్‌, నీషమ్‌, సీఫర్ట్‌ వంటి ఆటగాళ్లను మన బౌలర్లు అడ్డుకోగలిగారు. అంతేకాకుండా ప్రమాదకరమైన బౌల్ట్, సౌథీ, సోధి, సాంట్నర్‌, ఫెర్గూసన్‌తో కూడిన బౌలింగ్‌ దళాన్ని ఎదుర్కొని  పరుగులు రాబట్టడం సాధారణ విషయం కాదు. అలా అన్ని రంగాల్లో రాణించిన టీమ్‌ఇండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి టైటిల్‌ను అందుకుంది.

మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించిన టీమ్‌ఇండియా హ్యాట్రిక్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్‌ 17.2 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 73 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్ (51) అర్ధ శతకం సాధించినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మిగతా కివీస్‌ బ్యాటర్లలో సీఫర్ట్‌ (17), ఫెర్గూసన్‌ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్ (3/9) అదరగొట్టేశాడు. హర్షల్‌ పటేల్ (2/24), చాహల్ (1/26), వెంకటేశ్‌ అయ్యర్ (1/12), దీపక్ చాహర్ (1/26) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అక్షర్‌ పటేల్, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యారు. కివీస్‌పై టీమ్‌ఇండియా వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. 

కెప్టెన్‌ రోహిత్ అర్ధ శతకం.. ఆఖర్లో దంచిన బౌలర్లు

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ (56), ఇషాన్‌ కిషన్ (29) అర్ధశతకం భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు పడటంతో స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. అయితే మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్ (25), వెంకటేశ్‌ అయ్యర్ (20) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అలానే ఆఖర్లో హర్షల్‌ పటేల్ (18), దీపక్‌ చాహర్ (21*) దంచికొట్టారు. దీంతో టీమ్‌ఇండియా స్కోరు 184 పరుగులు అయింది. కివీస్‌ బౌలర్లలో సాంట్నర్‌ 3.. బౌల్ట్‌, మిల్నే, ఫెర్గూసన్, సోధి తలో వికెట్ తీశారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని