IND vs SL : రవీంద్రుడి మాయాజాలం.. మూడే రోజుల్లో టీమ్‌ఇండియా విజయం

మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ ...

Updated : 06 Mar 2022 17:26 IST

లంకతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్‌


 

ఇంటర్నెట్ డెస్క్‌ : బ్యాటింగ్‌లో భారీగా పరుగులు.. వికెట్ల వేటలో విజృంభణ.. ఇదీ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన.. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ షోతో కేవలం మూడు రోజుల్లోపే లంకేయుల భరతం పట్టేశారు. తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కు.. అలాగే విరాట్ కోహ్లీ వందో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్‌లో శ్రీలంక ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది.

మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 574/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం లంక మొదటి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ 178 పరుగులకే ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌లో దంచి కొట్టిన రవీంద్ర జడేజా.. బౌలింగ్‌లోనూ లంక పతనంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో జడేజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఆవార్డు దక్కింది. ఒకే రోజులో టీమ్‌ఇండియా ప్రత్యర్థికి చెందిన 16 వికెట్లను కూల్చగా.. అందులోనూ రవీంద్ర జడేజావే ఎనిమిది కావడం విశేషం. 

జడ్డూ మాయ.. అశ్విన్‌ అదుర్స్‌..

అద్భుత శతకం సాధించి టీమ్‌ఇండియాకు భారీ స్కోరు అందించిన రవీంద్ర జడేజా (175 నాటౌట్) బౌలింగ్‌లోనూ లంక బ్యాటర్లను హడలెత్తించాడు. లంకపై మొదట ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల (5/41) ప్రదర్శన చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (4/47) అదరగొట్టాడు. జడేజాకు తోడుగా రవిచంద్రన్‌ అశ్విన్‌ (2/49, 4/46) విజృంభించడంతో లంక విలవిలలాడింది. ఈ క్రమంలో అశ్విన్‌ (436) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో కపిల్‌ (434)ను అధిగమించి రెండోస్థానానికి ఎగబాకాడు. అందరి కంటే ముందు దిగ్గజ బౌలర్‌ అనిల్ కుంబ్లే (619) టాప్‌లో ఉన్నాడు. 

13 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు.. 


 

తొలి ఇన్నింగ్స్‌లో 108/4తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంకకు ఓవర్‌నైట్‌ బ్యాటర్లు అసలంక (29), నిసాంక (61*) మంచి ఆరంభమే ఇచ్చారు. వీరిద్దరూ కలిసి అర్ధశతక (58) భాగస్వామ్యం నిర్మించారు. ఎప్పుడైతే అసలంక పెవిలియన్‌కు చేరాడో లంక కుప్పకూలింది. 161/5తో ఫర్వాలేదనిపించినా.. మిగతా ఐదు వికెట్లను కేవలం 13 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. దీంతో 174 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో కరుణరత్నె 28, తిరిమన్నె 17, మాథ్యూస్‌ 22, డిక్వెల్లా 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 5, అశ్విన్‌ 2, బుమ్రా 2, షమీ ఒక వికెట్ తీశారు. 

రెండో ఇన్నింగ్స్‌లోనూ అదేబాట

400 పరుగుల లోటుతో ఫాలోఆన్‌ ఆడిన శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్లు బెంబేలెత్తించారు. మరీ ముఖ్యంగా జడేజా, అశ్విన్‌ స్పిన్‌తో చెలరేగారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ 178 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్‌ డిక్వెల్లా (51*) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లలో ధనంజయ డిసిల్వా 30, మాథ్యూస్ 28, కరుణరత్నె 27, అసలంక 20, నిసాంక 6 పరుగులు చేశారు. 121 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయిన లంకను డిక్వెల్లా-ఎంబుల్దేనియా (42 బంతుల్లో 2  పరుగులు) జంట కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఎనిమిదో వికెట్‌కు 14 ఓవర్లలో 32 పరుగులు జోడించారు. అయితే ఎంబుల్దేనియా పెవిలియన్‌కు చేరడంతో లంక పతనం ఎక్కువసేపు పట్టలేదు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా డిక్వెల్లా మాత్రం చూడచక్కని ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్ 4, షమీ 2 వికెట్లు పడగొట్టారు.

జట్టు స్కోరు వివరాలు: 

భారత్‌ : 574/8 డిక్లేర్డ్‌

శ్రీలంక : 174/10 (తొలి ఇన్నింగ్స్), 178/10 (రెండో ఇన్నింగ్స్‌)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని