IND vs AUS: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్‌.. ఆసీస్‌ ఆశలు సంక్లిష్టం

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. 

Updated : 25 Jun 2024 06:51 IST

గ్రాస్‌ ఐలెట్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియాను భారత్‌ 24 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (92; 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులకు పరిమితం అయింది. ట్రావిస్ హెడ్‌ (74; 43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ఆసీస్‌ గట్టిపోటీ ఇచ్చింది. తర్వాత భారత బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో పైచేయి సాధించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, కుల్దీప్‌ 2, అక్షర్‌, బుమ్రా ఒక వికెట్‌ తీశారు. ఈ ఓటమితో ఆసీస్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ప్రస్తుతం గ్రూప్‌ 1 నుంచి భారత్ సెమీస్ చేరింది. మరో బెర్తు అఫ్గాన్ లేదా ఆస్ట్రేలియాకు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆసీస్  అఫ్గానిస్థాన్ రెండేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్‌ ఓడితేనే మెరుగైన రన్‌రేట్‌తో ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ అఫ్గాన్‌ గెలిస్తే ఆసీస్‌ ఇంటి ముఖం పడుతుంది. 

ఆందోళన పుట్టించిన ట్రావిస్‌..

206 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. అర్ష్‌దీప్‌ వేసిన ఆరో బంతి బ్యాట్‌కు ఎడ్జ్‌ అయి స్లిప్‌లోకి వెళ్లింది. దీంతో అక్కడ ఉన్న సూర్య ముందుకు దూకి క్యాచ్‌ పట్టడంతో వార్నర్‌ (6) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిచెల్‌ మార్ష్‌ (37: 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకారంతో ట్రావిస్‌ హెడ్‌ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో ఓవర్లో మార్ష్‌ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదగా, బుమ్రా వేసిన నాలుగో ఓవర్లలో హెడ్‌ మూడు ఫోర్లు బాదాడు. హార్దిక్‌ వేసిన ఆరో ఓవర్లో హెడ్‌ రెండు సిక్స్‌లు కొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆసీస్‌ 65 పరుగులతో నిలిచింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్‌దీప్‌ యాదవ్‌ విడదీశాడు. 9 ఓవర్లో మార్ష్‌ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ వద్ద అక్షర్‌ పటేల్‌ గాల్లో ఎగిరి అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఆతర్వాతి ఓవర్‌లో ఫోర్లతో విరుచుకుపడి హెడ్‌ (24 బంతుల్లో) అర్ధశతకం చేశాడు. 10 ఓవర్లకు ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 99 పరుగులతో నిలిచింది. మూడో వికెట్‌గా వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (20: 12 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌) భారీ షాట్లతో ఎదురుదాడి ప్రారంభించాడు. అయితే కుల్దీప్‌ ఓ చక్కటి బంతితో మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన స్టాయినిస్‌ను అక్షర్‌ ఔట్‌ చేశాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 141 పరుగులతో నిలిచింది. ఆసీస్‌ విజయానికి 30 బంతుల్లో 65 పరుగులు కావాలి. క్రీజులో ఎడాపెడా బాదుతున్న హెడ్‌ ఉండడంతో భారత్‌ విజయంపై పూర్తి నమ్మకంగా లేదు. అయితే 17వ ఓవర్‌ వేసిన బుమ్రా.. హెడ్‌ను ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. వేడ్‌, టిమ్‌ డేవిడ్‌ను అర్ష్‌దీప్‌ ఒకే ఓవర్‌లో ఔట్‌ చేయడంతో ఆస్ట్రేలియా ఓటమిబాట పట్టింది. చివరి రెండు ఓవర్లలో ఆజట్టు విజయానికి 39 పరుగులు అవసరం కాగా ఆసీస్‌ 14 పరుగులు చేసి ఓటమి పాలైంది. 

రోహిత్‌ దంచికొట్టిన వేళ..

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. రోహిత్ శర్మ (92; 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీర విహారం చేయడంతో భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌ శర్మ ఆరంభం నుంచే చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిపడితే చాలు బౌండరీ అవతలికే అన్నట్లుగా విజృంభించాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ శతకం చేసేలా కనిపించాడు. కానీ, 92 పరుగుల వద్ద మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి తృటిలో శతకాన్ని మిస్‌ చేసుకున్నాడు. విరాట్‌ కోహ్లీ (0) నిరాశపరిచాడు. రెండో ఓవర్లోనే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి టిమ్‌ డేవిడ్‌ చేతికి చిక్కిపోయాడు. తొలి డౌన్‌లో వచ్చిన రిషభ్‌పంత్‌ (15)కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (31; 16 బంతుల్లో 3×4, 2×6) మెరుపులు మెరిపించాడు. అయితే దూకుడుగా ఆడుతున్న అతడి వేగానికి మిచెల్‌ స్టార్క్‌ కళ్లెం వేశాడు. జట్టు స్కోరు 159 పరుగుల వద్ద వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్య వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివం దుబే (28; 22 బంతుల్లో 2×4, 1×6), హార్దిక్‌ పాండ్య (27*; 17 బంతుల్లో 1×4, 2×6), జడేజా (9*; 5 బంతుల్లో 1×6) దూకుడుగా ఆడడంతో భారత్‌ 200 పరుగులు దాటింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ (1/14) పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిచెల్ స్టార్క్ (2/45), స్టాయినిస్‌ (2/56) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కమిన్స్‌ 48, ఆడమ్ జంపా 41 పరుగులు ఇచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని