IND vs WI: 3-0తో విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ఇండియా

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయపరంపర కొనసాగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది...

Updated : 28 Jul 2022 04:57 IST

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయపరంపర కొనసాగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 26 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా విండీస్‌ గడ్డపై తొలిసారి మూడు, అంతకన్నా ఎక్కువ జరిగిన వన్డే సిరీస్‌ల్లో తొలిసారి క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (42; 32 బంతుల్లో 5x4, 1x6), బ్రెండన్‌ కింగ్‌ (42; 37 బంతుల్లో 5x4, 1x6) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ మొత్తం చేతులెత్తేశారు. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. తొలుత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (98 నాటౌట్‌; 98 బంతుల్లో 7x4, 2x6) బ్యాట్‌తో అదరగొట్టగా.. తర్వాత బౌలర్లు చాహల్‌ 4/17, సిరాజ్‌ 2/14, శార్దూల్‌ 2/17 తమ పని పూర్తిచేశారు. దీంతో విండీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్‌.. కరీబియన్‌ జట్టుపై వరుసగా 12 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచి.. ఈ రికార్డు నెలకొల్పిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

సిరాజ్‌ అదిరే ఆరంభం..

భారీ ఛేదనకు దిగిన విండీస్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి భారత్‌కు అదిరే ఆరంభం ఇచ్చాడు. తన తొలి ఓవర్‌లో మేయర్స్‌(0), బ్రూక్స్‌ (0)లను డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. తర్వాత షై హోప్‌ (22; 33 బంతుల్లో 1x6), బ్రెండన్‌ కింగ్‌.. నిలకడగా ఆడి కాసేపు వికెట్లను కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో చాహల్‌ టీమ్‌ఇండియాకు మూడో బ్రేక్‌ ఇచ్చాడు. అతడు వేసిన 9.5 ఓవర్‌కు హోప్‌ క్రీజు వదిలి ముందుకు రాగా కీపర్‌ సంజూ స్టంపౌట్‌ చేశాడు. తర్వాత కెప్టెన్‌ పూరన్‌, కింగ్‌ మరో భాగస్వామ్యం నిర్మించేలా చూశారు. కానీ, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో కింగ్‌ బౌల్డవ్వడంతో కరీబియన్‌ జట్టు 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కార్టీ (5)తో కలిసి కాస్త నిలకడగా ఆడడానికి ప్రయత్నించిన పూరన్‌.. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి శిఖర్‌ ధావన్‌ చేతికి చిక్కాడు. దీంతో విండీస్‌ 103 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమివైపు పయనించింది. తర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆ జట్టు టెయిలెండర్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

తొలి శతకం కోల్పోయిన శుభ్‌మన్‌..

అంతకుముందు టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్‌ ధావన్‌ (58; 74 బంతుల్లో 7x4) అర్ధ శతకంతో మెరవగా తర్వాత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అదరగొట్టాడు. అతడు 98 పరుగుల వద్ద ఉండగా వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్‌కు తెరపడటంతో త్రుటిలో వన్డేల్లో తొలి శతకాన్ని కోల్పోయాడు. అయితే, ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 113 పరుగులు జోడించి.. జట్టు భారీ స్కోర్‌ సాధించడానికి పునాదులు వేశారు. ఈ క్రమంలోనే తొలుత అర్ధ శతకం పూర్తిచేసుకొని నిలకడగా ఆడుతున్న ధావన్‌ను.. హేడెన్‌ వాల్ష్‌ ఔట్‌ చేశాడు. అతడు వేసిన 22.5 ఓవర్‌కు షాట్ ఆడబోయిన గబ్బర్‌.. పూరన్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌ (44; 34 బంతుల్లో 4x4, 1x6) క్రీజులోకి రాగా.. తర్వాతి ఓవర్‌ పూర్తవ్వగానే వర్షం కురవడంతో మ్యాచ్‌ను రెండు గంటలకు పైగా నిలిపివేశారు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 24 ఓవర్లలో 115/1తో ఉంది. శుభ్‌మన్‌ (51) అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. శ్రేయస్‌ (2) పరుగులతో ఉన్నాడు. అయితే, మ్యాచ్‌ తిరిగి ప్రారంభమయ్యాక ఆటను చెరో 40 ఓవర్లకు కుదించారు.

శ్రేయస్‌తో కలిసి ధాటిగా..

మ్యాచ్‌ ప్రారంభమయ్యాక ధాటిగా ఆడిన శ్రేయస్‌, శుభ్‌మన్‌ గిల్‌.. 8 ఓవర్లలోనే 86 పరుగులు జోడించారు. దీంతో రెండో వికెట్‌కు మరో విలువైన భాగస్వామ్యం నిర్మించారు. అయితే, ధాటిగా ఆడుతూ అర్ధ శతకానికి చేరువైన శ్రేయస్‌ను హోసీన్‌ ఔట్ చేశాడు. అతడు వేసిన 32.2 ఓవర్‌కు భారీ  షాట్‌ ఆడబోయి కీమోపాల్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 199 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే సూర్యకుమార్‌ యాదవ్‌ (8; 6 బంతుల్లో 1x4) సైతం ఔటయ్యాడు. వాల్ష్‌ బౌలింగ్‌లో బ్రూక్స్‌ చేతికి చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ (6 నాటౌట్‌; 7 బంతుల్లో)తో కలిసి శుభ్‌మన్‌ నిలకడగా ఆడాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్‌ వన్డేల్లో తొలి శతకానికి రెండు పరుగుల దూరంలో ఉండగా మరోసారి వర్షం కురిసి మ్యాచ్‌ నిలిచిపోయింది. అప్పటికి టీమ్‌ఇండియా 36 ఓవర్లలో 225/3తో నిలిచింది. కాగా, వర్షం నిలిచిపోయాక అంపైర్లు.. డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో లెక్కించి విండీస్‌ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257గా నిర్దేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు