
తొలి అడుగుతోనే అదరగొట్టారు..!
అరంగేట్రంలో సత్తాచాటిన భారత ఆటగాళ్లు
‘‘ఏ మాత్రం విశ్వాసమున్నా... అక్షర్ పటేల్, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, ప్రసిద్ధ్ కృష్ణ.. ఇంగ్లాండ్ జట్టు ఫొటోను తమ ఇళ్లలో పెట్టుకుని రోజూ పూజించాలి’’.. ఇదీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఓ మీమ్. ఏదో సరదా కోసం ఇది రూపొందించినప్పటికీ.. ఈ భారత ఆటగాళ్లకు ఇంగ్లాండ్‌తో సిరీస్ ఎంతో కలిసొచ్చిందనేది మాత్రం నిజం. ఎందుకంటే ఈ సిరీస్‌లోనే వివిధ ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఈ ఆటగాళ్లు తమ తొలి ఇన్నింగ్స్‌ల్లోనే సత్తాచాటారు. తొలి సారి క్రీజులో అడుగుపెట్టామని భయం లేకుండా బ్యాట్స్‌మెన్.. మొదటి సారి బౌలింగ్ చేస్తున్నామనే బెరుకు లేకుండా బౌలర్లు అదరగొట్టారు. అద్భుత ప్రదర్శనతో మొదటి అడుగు ఘనంగా వేశారు. - ఈనాడు క్రీడా విభాగం
టెస్టుల్లో సరికొత్తగా..
పరిమిత ఓవర్ల జట్లలో ఐదారేళ్ల కిత్రమే అడుగుపెట్టినప్పటికీ అక్షర్ పటేల్ పేరు పెద్దగా వినిపించింది లేదు. కానీ ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా టెస్టు సిరీస్ విజయం తలుచుకుంటే ముందుగా అతని పేరే గుర్తుకు వస్తుంది. తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో అతను చూపించిన ప్రభావం అలాంటిది. రూట్‌సేనతో టెస్టు సిరీస్ కోసం భారత టెస్టు జట్టులోకి ఎంపికైన అక్షర్.. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓడింది. విజయంతో సిరీస్‌లో తిరిగి పుంజుకోవాలనే లక్ష్యంతో చెన్నైలోనే జరిగిన రెండో టెస్టులో భారత్ అడుగుపెట్టింది. ఆ మ్యాచ్‌తోనే అక్షర్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లతో సహా మొత్తం ఏడు వికెట్లతో సత్తాచాటాడు. తన తొలి టెస్టు వికెట్‌గా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన రూట్‌ను బలి తీసుకున్న అతను.. ఆ మ్యాచ్‌లో అశ్విన్‌తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండు రోజుల్లోనే ముగిసిన డేనైట్ టెస్టులో అక్షర్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. గులాబి బంతితో వికెట్లకు నేరుగా బౌలింగ్ చేసిన అతను ఆ మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టి జట్టుకు సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. చివరి టెస్టులోనూ 9 వికెట్లతో మెరిశాడు. తన బంతులను ఆడలేక ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. మొత్తం 3 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడంలో అక్షర్ ప్రధాన పాత్ర పోషించాడు.
ధనాధన్.. ఫటాఫట్
టెస్టు సిరీస్ విజయంతో ఉత్సాహంతో ఉన్న టీమ్‌ఇండియాను తొలి టీ20లోనే ఇంగ్లాండ్ కంగు తినిపించింది. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్ జట్టు అయిన తమతో పోరు అంత సులభం కాదని మోర్గాన్ సేన చాటింది. అయితే బలంగా పుంజుకుని ఆ సిరీస్‌ను 3-2తో భారత్ సొంతం చేసుకోవడంలో ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లది కీలక పాత్ర. వాళ్లే ఇషాన్ కిషాన్, సూర్య కుమార్ యాదవ్. రెండో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఇద్దరూ తమ ప్రతిభను చాటారు. ఆ మ్యాచ్‌లో 165 పరుగుల ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ అనూహ్యంగా చెలరేగాడు. 32 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో.. అది కూడా ఆర్చర్ లాంటి అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటూ అలవోకగా భారీ షాట్లు ఆడిన అతని బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. తొలి ఓవర్లోనే వికెట్ పడ్డప్పటికీ.. కెప్టెన్ కోహ్లితో కలిసి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతని తెగువ ప్రశంసనీయం. ఇక ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని సూర్యకుమార్.. నాలుగో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిరీస్ కోల్పోకూడదు అంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఆ మ్యాచ్‌లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య భగ్గుమన్నాడు. ఆ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే (ఆర్చర్ బౌలింగ్) సిక్సర్‌గా మలచిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అర్ధశతకంతో చెలరేగిన తను మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మెరుగైన స్కోరు చేయడంలో సాయపడ్డాడు. నిర్ణయాత్మక అయిదో టీ20లోనూ 17 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టు విజయంలో దోహదపడ్డాడు.
వన్డే హీరోలు..
ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌తో.. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య, తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అంచనాలకు మించి రాణించారు. బ్యాట్‌తో కృనాల్, బంతితో ప్రసిద్ధ్ సత్తాచాటి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పటికే టీమ్‌ఇండియా తరపున 18 టీ20లాడిన కృనాల్.. పూర్తి ఉద్వేగభరిత వాతావరణంలో తన తొలి వన్డేలో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. తమ్ముడు హార్దిక్ చేతుల మీదుగా టోపీ అందుకున్న తర్వాత ఈ ఏడాది జనవరిలో చనిపోయిన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న కృనాల్ మ్యాచ్ సాంతం అదే భావోద్వేగంతో కనిపించాడు. మనసులో నాన్న తిరుగుతుండగా.. మైదానంలో అతను మాత్రం బౌండరీలతో చెలరేగాడు. 260 కూడా చేయడం కష్టమనుకున్న జట్టును రాహుల్‌తో కలిసి ఏకంగా 300 దాటించాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేసిన అతను కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం అందుకుని అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో పేసర్ ప్రసిద్ధ్ అద్భుత ప్రదర్శన చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది అతనే. ఓపెనర్ల దూకుడుతో ఓ దశలో 14.1 ఓవర్లలోనే 135/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్తోన్న ప్రత్యర్థికి అడ్డుపడింది అతనే. తన వరుస ఓవర్లలో రాయ్‌తో పాటు స్టోక్స్‌నూ వెనక్కి పంపి భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. అతని స్ఫూర్తితో తిరిగి లయ అందుకున్న బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్.. అరంగేట్ర వన్డేలో అత్యధిక వికెట్లు (4/54) తీసిన భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు.