సూర్య.. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది

మార్చి 12 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌.. ఇద్దరు ఎంపికవ్వడం పట్ల ఆ ఫ్రాంఛైజీ సంతోషం వ్యక్తం చేసింది...

Updated : 21 Feb 2021 12:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్చి 12 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌.. ఇద్దరు ఎంపికవ్వడంపై ఆ ఫ్రాంఛైజీ సంతోషం వ్యక్తం చేసింది. కృషి, పట్టుదలతో టీమ్‌ఇండియాకు ఎంపికయ్యారని ట్వీట్‌ చేస్తూ వారిని అభినందించింది. మరోవైపు చాలా రోజుల నుంచి ఈ పిలుపు కోసం ఎదురు చూస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు పలువురు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు అభినందనలు చెప్పారు. అతడి నిరీక్షణకు తెరపడిందని, ఎట్టకేలకు భారత జట్టుకు ఎంపికయ్యాడని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో పాటు హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆర్పీసింగ్‌, వసీమ్‌ జాఫర్‌, రమేశ్‌ పవార్‌ తదితరులు ట్వీట్‌ చేశారు. కాగా, ఏ ఆటగాడికైనా టీమ్‌ఇండియా తరఫున ఆడటమే అతపెద్ద గౌరవమని సచిన్‌ పేర్కొన్నారు.

సూర్య గతకొన్నేళ్లుగా ఇటు ఐపీఎల్‌తో పాటు అటు దేశవాళీ క్రికెట్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా రోజులుగా టీమ్‌ఇండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నాడు. అయితే, యూఏఈలో గతేడాది జరిగిన ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శన చేయడంతో ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవుతాడని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కానీ, అతడిని ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలోనే అప్పుడు సూర్యను ఎంపిక చేయకపోవడాన్ని హర్భజన్‌, ఇర్ఫాన్‌ వంటి కొంతమంది క్రికెటర్లు బీసీసీఐని నిలదీశారు. త్వరలోనే భారత జట్టుకు ఆడతావని అతడికి ధైర్యం చెప్పారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సూర్య ఇంగ్లాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యాడు.

అలాగే శనివారం రాత్రి బీసీసీఐ ప్రకటించిన టీ20 జట్టులో సూర్యకుమార్‌తో పాటు కొత్తగా ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాతియాకు కూడా చోటు లభించింది. ఇషాన్‌ గత ఐపీఎల్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడగా, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్‌ తెవాతియా ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు బాది వెలుగులోకి వచ్చాడు. దీంతో వారిని కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. మరోవైపు కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు ఎంపికైనా గాయం కారణంగా తప్పుకున్నాడు. అతడికి ఈ సిరీస్‌లో మరో అవకాశం కల్పించారు.

భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య, పంత్‌, ఇషాన్‌ కిషన్‌, చాహల్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, సుందర్‌, రాహుల్‌ తెవాతియా, నటరాజన్‌, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని