
Team India: ఆ చారిత్రక విజయానికి ఏడాది.. బీసీసీఐ ట్వీట్
ఇంటర్నెట్ డెస్క్ : గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా గబ్బా మైదానంలో సాధించిన చారిత్రక విజయానికి నేటితో ఏడాది. ఈ సందర్భంగా బీసీసీఐ ఆటగాళ్లను అభినందిస్తూ ఓ ట్వీట్ చేసింది. భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు గాయాల పాలైనా.. విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాడు దూరమైనా.. యువ ఆటగాళ్లు రాణించి టీమిండియాకు చరిత్రాత్మక విజయాన్ని అందించారని కొనియాడింది.
సిరీస్ నిర్ణయాత్మక నాలుగో టెస్టు జరిగిన గబ్బా మైదానంలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు ఎదురే లేదు. గత మూడు దశాబ్దాలుగా అక్కడ ఓటమన్నదే ఎరుగదు. అలాంటి ఘనమైన రికార్డును అజింక్య రహానె సారథ్యంలోని భారత జట్టు బద్దలు కొట్టింది. మూడు వికెట్ల తేడాతో కంగారూలను ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ అపురూప విజయం అంత సులభంగా ఏం దక్కలేదు. ఆస్ట్రేలియా చివరి వరకు ప్రతిఘటించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభిన భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కంగారూలకు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో మరో 294 పరుగులు జోడించి భారత్ ముందు 327 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంతి అనూహ్యంగా దూసుకొచ్చే గబ్బా పిచ్‌పై ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడమనేది దాదాపు అసాధ్యమే. కానీ, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (91), ఛెతేశ్వర్ పుజారా (56), రిషభ్ పంత్ (89), వాషింగ్టన్ సుందర్ (22) రాణించడంతో భారత్ చరిత్రను తిరగరాసింది. 3 వికెట్ల తేడాతో విజయం సాధించి.. కంగారూల గడ్డపై రెండో సారి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
అంతకు ముందు, అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మెల్ బోర్న్లో జరిగిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. హనుమ విహారి, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసమాన పోరాటం చేయడంతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా గా ముగిసింది. సిరీస్ నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత పోరాటం గురించి తెలిసిందే.