T20 World Cup: ఆస్ట్రేలియాకు బయల్దేరిన భారత టీ20 బృందం

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత బృందం గురువారం తెల్లవారు జామున ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లింది.

Published : 06 Oct 2022 12:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత బృందం గురువారం తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లింది. ప్రపంచ కప్‌ టోర్నీకి బయల్దేరే మందు భారత బృందం సభ్యులు, సహ క్రికెటర్లతో కలిసి దిగిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఈ పర్యటనకు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో విజయకేతనం ఎగురవేసి రోహిత్‌ సేన ఉత్సాహంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో టీమ్‌ ఇండియా సమష్టిగా పనిచేస్తే ప్రపంచకప్‌లో విజయం పెద్ద కష్టమేమీకాదు.

ఇటీవల కాలంలో భారత్‌ బౌలర్ల ఆటతీరు డెత్‌ ఓవర్లలో నిరాశాజనకంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కీలక బౌలర్‌ బుమ్రా గాయంతో టోర్నీకి దూరం కావడం జట్టు సమస్య మరింత తీవ్రమైంది. మరో వైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం డెత్‌ ఓవర్ల విషయంలో ధైర్యంగానే ఉన్నాడు. ఇటీవల అతడు మాట్లాడుతూ ‘డెత్‌ ఓవర్ల అంశం ఆందోళన కలిగించలేదు. అయితే మ్యాచ్‌ చివరలో జట్టు పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. గత ఐదారు మ్యాచ్‌ల్లో డెత్‌ ఓవర్లలో బాగా బౌలింగ్‌ చేయలేదు. ఆ అంశమే మాకు సవాలు విసురుతోంది. డెత్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం కష్టమే. ఆట ఫలితం తేలేదీ ఇక్కడే. అలా అని డెత్‌ వైఫల్యం ఆందోళన చెందే విషయమని నేను చెప్పను. కానీ.. కచ్చితంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నాడు.

మహమ్మద్‌ షమీ లేదా దీపక్‌ చాహర్‌లలో ఒకరు బుమ్రా స్థానం దక్కించుకోవచ్చనే అంచనాల ఉన్నాయి. అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్‌ ప్రపంచ కప్‌ వేటను మొదలుపెట్టనుంది. సూపర్‌ -12 దశకు ముందు భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిల్లో భాగంగా అక్టోబర్‌ 17న ఆస్ట్రేలియా, అక్టోబర్‌ 19న న్యూజిలాండ్‌తో తలపడనుంది.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని