T20 Cricket: రాజస్థాన్‌ భళా.. చెన్నైవిలవిల.. ఇంకా ఆ మూడు జట్లే ‘200’ కొట్టలేదు

టీ20 క్రికెట్‌లో పరుగులు పారితేనే చూసే అభిమానులకు ఆడే ఆటగాళ్లకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో 180, 190 స్కోర్లు సాధారణంగా మారిపోయాయి...

Published : 21 Apr 2022 01:53 IST

(Photos: Sanju, Jadeja Instagram)

టీ20 క్రికెట్‌లో పరుగులు వరద పారితేనే చూసే అభిమానులకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో 180, 190 స్కోర్లు సాధారణంగా మారిపోయాయి. ఇక 200 పైచిలుకు పరుగులు కూడా ఒక్కోసారి తక్కువవుతున్నాయి. ప్రత్యర్థులు ధనాధన్ బ్యాటింగ్‌తో వాటినీ ఛేదించేస్తున్నారు. అలా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 200 పరుగులకుపైగా సాధించిన జట్లేవంటే..

ఇప్పటివరకు ఈ సీజన్‌లో మొత్తం ఏడు జట్లు 200కు పైగా స్కోర్లు సాధించాయి. అందులో రాజస్థాన్‌, చెన్నై చెరో రెండో సార్లు సాధించగా.. బెంగళూరు, పంజాబ్‌, లఖ్‌నవూ, దిల్లీ, కోల్‌కతా జట్లు ఒక్కోసారి ఈ భారీ స్కోర్లు చేశాయి. ఇక్కడ రెండొందల మార్క్‌ చేరుకోనిది గుజరాత్‌, హైదరాబాద్‌, ముంబయి మాత్రమే.


* బెంగళూరుకు షాకే: ఈ సీజన్‌లో బెంగళూరు ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే 205/2 పరుగుల భారీస్కోర్‌ చేసింది. దాన్ని పంజాబ్‌ ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ (88; 57 బంతుల్లో 3x4, 7x6) దంచికొట్టాడు. ఛేదనలో పంజాబ్‌ బ్యాటర్లు ధావన్‌ (43), రాజపక్స (43), షారుఖ్‌ ఖాన్‌ (24*), ఒడియన్‌ స్మిత్‌ (25) తలా ఓ చేయి వేయడంతో ఆ జట్టు తేలిగ్గా గెలిచింది.


(Photo: Sanju Samson Instagram)

* రాజస్థాన్‌ రెండోసారి: రాజస్థాన్‌ ఈ సీజన్‌లో రెండుసార్లు 200 పైచిలుకు పరుగులు చేసింది. రెండింటిలోనూ ప్రత్యర్థులను కట్టడి చేసి విజయం సాధించడం విశేషం. తొలుత హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో 210/6 భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో విలియమ్సన్‌ టీమ్‌ 149/7కే చేతులెత్తేసింది. ఇక ఇటీవలే కోల్‌కతాపై 217/5 మరోసారి రెండొందల స్కోర్‌ దాటడమే కాకుండా ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గట్టి పోటీనిచ్చి గెలిచేలా కనిపించింది. కానీ, చివర్లో కట్టుదిట్టంగా బంతులేసి రాజస్థాన్‌ ఆ జట్టును 210 పరుగులకు ఆలౌట్‌ చేసింది.


(Photo: Ravindra Jadeja Instagram)

* అయ్యో చెన్నై: లఖ్‌నవూతో తన రెండో మ్యాచ్‌ ఆడిన చెన్నై మొదట బ్యాటింగ్‌ చేసి 210/7 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో కేఎల్ రాహుల్‌ టీమ్‌ దంచికొట్టడంతో 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇక రెండోసారి బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లోనూ 216/4 భారీ స్కోర్‌ నమోదు చేయగా.. ఛేదనలో బెంగళూరు గట్టిగానే ప్రయత్నించింది. కానీ, చివరికి 193/9 స్కోర్‌ వద్దే నిలిచిపోయి ఓటమిపాలైంది. దీంతో చెన్నై ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో భారీ పరుగులు చేసినా ఒక విజయం, ఒక ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.


(Photo: Rishabh Pant Instagram)

* దిల్లీ మెరుపులు: దిల్లీ ఈ సీజన్‌లో ఒకేసారి 200 పరుగులకు పైగా స్కోర్‌ చేసింది. అదీ కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో ఓపెనర్లు పృథ్వీ షా (51), డేవిడ్‌ వార్నర్‌ (61) దంచికొట్టడంతో 215/5 స్కోర్‌ సాధించింది. ఇక ఛేదనలో కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (54) రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు 171 పరుగులకే ఆలౌటైంది. దీంతో దిల్లీ ఈ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని