
2022 T20 World Cup: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీకి వేదికల ఖరారు
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయా మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను అక్కడి అధికారులు ఖరారు చేశారు. మొత్తం ఏడు నగరాల్లో 2022 టీ20 ప్రపంచకప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మొత్తం 45 మ్యాచ్‌లు నిర్వహించనుండగా.. వాటికి అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబార్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ నగరాలను వేదికలుగా నిర్ణయించారు. ఇందులో మెల్‌బోర్న్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా, సిడ్నీ, అడిలైడ్‌లలో సెమీస్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
‘ఆస్ట్రేలియాలో మళ్లీ ఐసీసీ టోర్నీలు జరగడం సంతోషంగా ఉంది. వాటి నిర్వహణ కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. వచ్చే ఏడాది జరగబోయే పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ఏడు నగరాలు ఆతిథ్యమివ్వబోతున్నాయి. 2020లో మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహించాక రెండేళ్ల తర్వాత పటిష్ఠ కార్యాచరణతో స్థానిక అధికారులతో కలిసి ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఐసీసీ టోర్నీల పర్యవేక్షకుడు క్రిస్ టెట్లీ తెలిపారు.
ఇక ఆదివారం పూర్తయిన 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడగా.. ఈ రెండు జట్లూ నేరుగా సూపర్-12లో అడుగుపెడతాయి. మరోవైపు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు టాప్-8 ర్యాంకుల్లో ఉన్నందున ఇవి కూడా సూపర్-12కు నేరుగా చేరుకుంటాయి. శ్రీలంక, వెస్టిండీస్ జట్లు మాత్రం మిగతా చిన్న జట్లతో అర్హత పోటీల్లో తలపడతాయి. ఈ అర్హత పోటీలను రెండు దశల్లో నిర్వహిస్తుండగా.. తొలుత ఫిబ్రవరిలో ఒమన్‌లో ఒక టోర్నీ.. తర్వాత జూన్‌లో జింబాబ్వేలో మరో టోర్నీ నిర్వహించనున్నారు.