T20 World Cup: స్కాట్లాండ్‌ జెర్సీ వెనక 12 ఏళ్ల చిన్నారి

టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో స్కాట్లాండ్‌ సూపర్‌ 12 దశకు చేరువైంది. మైదానంలో ఆటతో సత్తాచాటుతున్న ఆ జట్టు ఆటగాళ్లు ధరించిన జెర్సీ వెనక ఆశ్చర్యాన్ని..

Updated : 21 Oct 2021 07:11 IST

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో స్కాట్లాండ్‌ సూపర్‌ 12 దశకు చేరువైంది. మైదానంలో ఆటతో సత్తాచాటుతున్న ఆ జట్టు ఆటగాళ్లు ధరించిన జెర్సీ వెనక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఉంది. ముదురు నీలం, ఉదా రంగుల కలయికతో ఉన్న ఆ జెర్సీని రూపొందించింది ఓ 12 ఏళ్ల బాలిక. తన పేరు రెబెక్కా డౌనీ. తమ జట్టు ప్రపంచకప్‌ జెర్సీ డిజైన్‌ కోసం దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల నుంచి 200 నమూనాలు రాగా.. అందులో డౌనీ పంపించిన దాన్ని క్రికెట్‌ స్కాట్లాండ్‌ ఎంపిక చేసింది. ఆ దేశ జాతీయ చిహ్నమైన పువ్వులతో కూడిన ముళ్ల చెట్టు (తిస్టిల్‌) రంగుల ఆధారంగా ఆమె ఈ జెర్సీకి రూపాన్నిచ్చింది. ‘‘హాడింగ్‌టన్‌కు చెందిన 12 ఏళ్ల డౌనీ స్కాట్లాండ్‌ కిట్‌ను డిజైన్‌ చేసింది. తాను రూపొందించిన ఈ జెర్సీని గర్వంగా ధరించి మా తొలి మ్యాచ్‌ను టీవీలో చూసింది. ఆమెకు ధన్యవాదాలు’’ అని క్రికెట్‌ స్కాట్లాండ్‌ ట్వీట్‌ చేసింది. ‘‘జెర్సీ డిజైన్‌ కోసం పెట్టిన పోటీలో గెలిచానని తెలిసినప్పుడు నమ్మలేకపోయా. నిజ జీవితంలో ఈ జెర్సీని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అది అద్భుతంగా కనిపిస్తోంది. జింబాబ్వేతో స్కాట్లాండ్‌ మ్యాచ్‌ సందర్భంగా జట్టును కలవడం, మ్యాచ్‌ చూడడం గొప్పగా అనిపించింది. నేను రూపొందించిన జెర్సీ ధరించి ప్రపంచకప్‌లో మా జట్టు కోసం కేరింతలు కొడతా’’ అని డౌనీ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని