Hanuma Vihari: విహారి.. మళ్లీ హైదరాబాద్‌కు

టీమ్‌ ఇండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ హనుమ విహారి అయిదు సీజన్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో తిరిగి హైదరాబాద్‌ తరఫున ఆడనున్నాడు. విహారి.. 2015-16 సీజన్‌లో హైదరాబాద్‌ను వీడి ఆంధ్ర జట్టులో చేరాడు

Published : 16 Sep 2021 07:33 IST

హైదరాబాద్‌: టీమ్‌ ఇండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ హనుమ విహారి అయిదు సీజన్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో తిరిగి హైదరాబాద్‌ తరఫున ఆడనున్నాడు. విహారి.. 2015-16 సీజన్‌లో హైదరాబాద్‌ను వీడి ఆంధ్ర జట్టులో చేరాడు. ఇప్పుడు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘాన్ని మహ్మద్‌ అజహరుద్దీన్‌ నడిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ హైదరాబాద్‌కు ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. ‘‘ఆంధ్ర క్రికెట్‌ సంఘాన్ని వీడుతున్నా. గత అయిదేళ్లు ఆంధ్రకు ఆడడం, నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అని విహారి ట్విట్టర్లో తెలిపాడు. ‘‘వచ్చే సీజన్‌ నుంచి హైదరాబాద్‌కు ఆడతా’’ అని అతడు చెప్పాడు. ఇంతకాలం తనకు మద్దతిచ్చిన ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు, ఆటగాళ్లు, కోచ్‌లకు విహారి కృతజ్ఞతలు తెలిపాడు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 94 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 55 సగటుతో 7261 పరుగులు చేశాడు. ఇందులో 21 శతకాలు ఉన్నాయి. 80 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 3001 పరుగులు సాధించాడు. విహారి తిరిగి హైదరాబాద్‌కు రావడంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ కీలక పాత్ర పోషించి ఉండొచ్చని భావిస్తున్నారు. డిసెంబరు-జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక కాకపోతే వచ్చే రంజీ సీజన్‌లో హైదరాబాద్‌ రంజీ జట్టుకు విహారి సారథ్యం వహించే అవకాశముంది. అంతకన్నా ముందు అతడు ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే టోర్నీల్లో ఆడతాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని