IND vs SA: హార్దిక్‌ లేని లోటును శార్దూల్‌ భర్తీ చేస్తున్నాడు: ఆకాశ్‌ చోప్రా

హార్దిక్‌ పాండ్య నుంచి టీమ్‌ఇండియా ఏదైతే ఆశిస్తుందో శార్దూల్‌ ఠాకూర్‌ దాన్ని పూర్తిగా నెరవేరుస్తున్నాడని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో...

Updated : 06 Jan 2022 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హార్దిక్‌ పాండ్య నుంచి టీమ్‌ఇండియా ఆశించిన దాన్ని శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఏడు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో కెరీర్‌లోనే అత్యుత్తమ గణంకాలు నమోదు చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. దీని గురించి ఆకాశ్‌ స్పందించాడు. ఆల్‌రౌండర్‌ స్థానం విషయమై హార్దిక్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకూర్‌ను పోలుస్తూ మాట్లాడాడు.

‘‘బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకూర్‌ను పోల్చడం సరికాదు. బ్యాటింగ్‌ పరంగా చూస్తే పాండ్య చాలా ముందున్నాడు. పాండ్య భారీ పరుగులు చేయగలడు. ఇక బౌలింగ్‌లో హార్దిక్‌ కన్నా శార్దూల్‌ మెరుగ్గా ఉన్నాడు. మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొడుతున్నాడు’ అని ఆకాశ్‌ చోప్రా వివరించాడు. ‘‘శార్దూల్‌ రెండో టెస్టులో చేసిన ప్రదర్శన అత్యద్భుతం. ఏడు వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌ 24 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అయితే, ఆ పరుగులు ఎంత విలువైనవో బుధవారం గుర్తించకపోయి ఉండొచ్చు. కానీ, గురువారం వాటి విలువ తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులే కావాలి. ఒకవేళ శార్దూల్‌ ఆ పరుగులు చేయకపోయుంటే నేడు దక్షిణాఫ్రికా లక్ష్యం మరింత తక్కువగా ఉండేది. విహారితో కలిసి ఏడో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పకపోయి ఉంటే టీమ్‌ఇండియా ఈపాటికే ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచేది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని