
AB devilliers: ఆర్సీబీకి బిగ్ షాక్.. క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలికిన డివిలియర్స్
ఇంటర్నెట్డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుకు గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా మొత్తం ఆటకే వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తనకు అవకాశం కల్పించిన అన్ని జట్లకూ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇన్నేళ్లు క్రికెటర్గా కొనసాగడం అద్భుతమైన ప్రయాణమని, కానీ.. ఇప్పుడు ఆటకు మొత్తానికే వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపాడు. దీంతో వచ్చే మెగా ఐపీఎల్ సీజన్లో డివిలియర్స్ ఆర్సీబీలోనే కాకుండా ఏ జట్టులోనూ ఆడడనే విషయం అర్థమైంది.
‘నేను చిన్నప్పుడు మా సోదరులతో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఆటను ఎంతగానో ఆస్వాదించాను. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో అలాంటి కసిలేదు. ఈ ఆట నాకెంతో ఇచ్చింది. టైటాన్స్, దక్షిణాఫ్రికా, ఆర్సీబీ ఇలా ఏ జట్టు తరఫున ఆడినా నాకు చాలా మంచి అవకాశాలు కల్పించింది. దీనికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా నాతో కలిసి పనిచేసిన, ఆడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. నేను ఎక్కడ ఆడినా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, భారత్లో విశేష గుర్తింపు దక్కింది. చివరగా నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం లేకపోతే ఇంతటి విజయం సాధ్యం కాదు. ఇకపై నా జీవితంలో మరో అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటా’ అని డివిలియర్స్ ట్వీట్లు చేశాడు.
ఒక శకం ముగిసింది: ఆర్సీబీ
మరోవైపు డివిలియర్స్ నిర్ణయంపై ఆర్సీబీ ఫ్రాంఛైజీ విచారం వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లు ఆ జట్టుతో కలిసి ఆడిన అతడు బెంగళూరు ఫ్రాంఛైజీలో కోహ్లీ తర్వాత అతికీలకమైన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ ఈ విధంగా స్పందించింది. ‘ఒక శకం ముగిసింది. నీలాంటి క్రికెటర్ మరొకరు లేరు. ఏబీ.. ఆర్సీబీలో లేకపోతే మేం కచ్చితంగా నిన్ను మిస్ అవుతాం. మా జట్టును, అభిమానులను, క్రికెట్ ప్రేమికులను నువ్వు ఎంతగా అలరించావో అందరికీ తెలుసు. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. హ్యాపీ రిటైర్మెంట్ లెజెండ్’ అని భావోద్వేగ భరితంగా స్పందించింది.
నేనిప్పుడు హాఫ్ ఇండియన్: ఏబీడీ
ఇక ఆర్సీబీ పోస్టు చేసిన మరో వీడియోలో డివిలియర్స్ మాట్లాడుతూ.. నేను ఎప్పటికీ ఆర్సీబీ అభిమానిగానే ఉంటా. ఈ జట్టులోని ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే. ఆటగాళ్లు వస్తారు. వెళతారు. కానీ, ఇక్కడుండే ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పుడు నేను హాఫ్ఇండియన్ అయిపోయాను. అందుకు గర్వంగా ఉంది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.