Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం అథ్లెట్లు సన్నద్ధమవ్వడం కష్టంగా ఉంటుంది: అభినవ్‌ బింద్రా

2024లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వడం అథ్లెట్లకు అంత తేలికకాదని, చాలా కష్టంగా ఉంటుందని ప్రముఖ షూటర్‌ అభినవ్‌ బింద్రా అభిప్రాయపడ్డారు. వచ్చే ఒలింపిక్స్‌కు ఇంకా మూడేళ్ల సమయమే ఉందని గుర్తుచేశారు...

Published : 20 Aug 2021 01:41 IST

ముంబయి: 2024లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వడం అథ్లెట్లకు అంత తేలికకాదని, చాలా కష్టంగా ఉంటుందని ప్రముఖ షూటర్‌ అభినవ్‌ బింద్రా అభిప్రాయపడ్డారు. వచ్చే ఒలింపిక్స్‌కు ఇంకా మూడేళ్ల సమయమే ఉందని గుర్తుచేశారు. దాంతో క్రీడాకారులు ఇప్పటి నుంచే మళ్లీ సాధన ప్రారంభించాలన్నారు. కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ ఏడాది పాటు వాయిదా పడి ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే ఒలింపిక్స్‌కు ఇంకా మూడేళ్ల సమయమే మిగిలి ఉందని బింద్రా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారని, దాంతో మునుపెన్నడూ లేని విధంగా ఏడు పతకాలతో తిరిగొచ్చారని కొనియాడారు.

‘ఇదొక చారిత్రక ప్రదర్శన. ఎప్పుడూ లేనిది మన క్రీడాకారులు ఏడు పతకాలు సాధించారు. కొందరు అద్భుత ఆటతీరుతో మైమరపిస్తే మరికొందరు గుండెకోతతో తిరిగొచ్చారు. అయితే, ఇవన్నీ క్రీడల్లో భాగమే. ఇప్పుడు మనమెంతో మెరుగయ్యాం. మున్ముందు మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తాము. కానీ, వచ్చే ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు అథ్లెట్లకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దానికి మూడేళ్ల సమయమే మిగిలి ఉంది. సహజంగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లకు ఏడాది పాటు విశ్రాంతి లేదా కోలుకునే సమయం ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈసారి క్రీడాకారులు చాలా త్వరగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలి. అలాగే వారిని ప్రారంభదశ నుంచే సరైన విధంగా ప్రోత్సహించాలి. శిక్షణలో మెరుగైన వసతులు కల్పించాలి. ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి’ అని బింద్రా చెప్పుకొచ్చారు. కాగా, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఈ స్టార్‌ షూటర్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో విభాగంలో ఆ ఘనత సాధించి కొత్త చరిత్ర సృష్టించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని