Tokyo Olympics: ఊహించని అద్భుతం.. గోల్ఫ్‌లో భారత్‌కు రజతం రానుందా?

ఎవరూ ఊహించని క్రీడలో భారత్‌కు మరో పతకం వచ్చేలా కనిపిస్తోంది! అన్నీ సవ్యంగా సాగితే.. అదృష్టం కలిసొస్తే ఒలింపిక్స్‌ గోల్ఫ్‌లో రజతం లేదా కాస్యం ఖాయమే అనిపిస్తోంది. భారత యువ కెరటం అదితి అశోక్‌ టోక్యోలో అదరగొడుతోంది..

Published : 06 Aug 2021 11:55 IST

ఆశలు పెంచుతున్న అదితి అశోక్‌

టోక్యో: ఎవరూ ఊహించని క్రీడలో భారత్‌కు మరో పతకం వచ్చేలా కనిపిస్తోంది! అన్నీ సవ్యంగా సాగితే.. అదృష్టం కలిసొస్తే ఒలింపిక్స్‌ గోల్ఫ్‌లో రజతం లేదా కాంస్యం ఖాయమే అనిపిస్తోంది. భారత యువ కెరటం అదితి అశోక్‌ టోక్యోలో అదరగొడుతోంది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్‌ ముగిసే సరికి రెండో స్థానంలో నిలిచింది.

కీలకమైన నాలుగో రౌండ్‌ శనివారం జరగనుంది. ప్రస్తుతం టోక్యో వాతావరణం మారుతోంది. కొన్ని చోట్ల విపరీతంగా ఎండ కాస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ గాలి ఉద్ధృతంగా వీస్తూ.. వర్షం కురిస్తే మూడో రౌండ్‌ వరకే ఫలితాలను లెక్కలోకి తీసుకుంటారు. అలా జరిగితే అదితికి రజత పతకం వచ్చినట్టే.

ప్రస్తుతం అమెరికా అమ్మాయి కొర్దా నెల్లీ 198 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. గోల్ఫ్‌లో ఎవరికి తక్కువ స్కోరుంటే వారే విజేతగా ఆవిర్భవిస్తారు. అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలిరౌండ్లో 67, రెండో రౌండ్లో 66, మూడో రౌండ్లో 68 పాయింట్లు సాధించింది. ఇక మూడో స్థానానికి ఉమ్మడిగా 203 పాయింట్లతో నలుగురు పోటీ పడుతున్నారు. భారత్‌కే చెందిన దీక్షా దాగర్‌ 220 పాయింట్లతో ఉమ్మడిగా 51వ స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని