Tokyo Olympics: అదితి పతకానికి తుపాను అంతరాయం.. ఏం జరిగేనో! అందరిలోనూ ఉత్కంఠ!

భారత గోల్ఫ్‌ క్రీడాకారిణి అదితి అశోక్‌ అద్భుతానికి చేరువలో ఉంది. ఒలింపిక్స్‌లో పతకానికి దగ్గరైంది! ఇంతలోనే వరుణుడు కంట్రీ క్లబ్‌లోకి రంగప్రవేశం చేయడంతో నాలుగో రౌండ్‌కు అంతరాయం ఏర్పడింది. ..

Updated : 07 Aug 2021 09:45 IST

టోక్యో: భారత గోల్ఫ్‌ క్రీడాకారిణి అదితి అశోక్‌ అద్భుతానికి చేరువలో ఉంది. ఒలింపిక్స్‌లో పతకానికి దగ్గరైంది! ఇంతలోనే వరుణుడు కంట్రీ క్లబ్‌లోకి రంగప్రవేశం చేయడంతో నాలుగో రౌండ్‌కు అంతరాయం ఏర్పడింది. తుపాను హెచ్చరికల సైరన్‌ మోగడంతో ఆటను నిలిపివేశారు. అమ్మాయిలంతా క్లబ్‌హౌజ్‌కు చేరుకున్నారు.

దాదాపుగా అదితి ఆట పూర్తైంది! మరో రెండు హోల్స్‌ను మాత్రమే ఆమె పూర్తి చేయాల్సి ఉంది. న్యూజిలాండ్‌ అమ్మాయి లిడియా కోతో కలిసి ఉమ్మడిగా ఆమె మూడో స్థానంలో ఉంది. ఆట ఈ రోజు నిర్వహిస్తారా? ఆదివారం పూర్తి చేస్తారా? లేదా మూడో రౌండ్‌ ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తారా అన్న సమాచారం తెలియాల్సి ఉంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఏ మాత్రం అవకాశం లభించినా ఆటను పూర్తి చేయడానికే నిర్వాహకులు ప్రయత్నిస్తారు. నేడు కుదరకపోతే ఆదివారం ఉదయం నిర్వహిస్తారు. తుపాను తీవ్రమై నిర్వహణకు ఆస్కారం లేకపోతే మూడో రౌండ్‌ ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే అదితి రజతం గెలవొచ్చు!

ఆట పూర్తైనప్పుడు అదితి ఇంకెవరితోనూ ఉమ్మడిగా ఒకే స్థానంలో ఉండకూడదు. కచ్చితంగా 1, 2, 3 స్థానాల్లోనే ఉండాలి. ఒకవేళ మరొకరితో కలిసి మూడో స్థానంలో నిలిస్తే వారిద్దరి మధ్య ప్లేఆఫ్‌ నిర్వహిస్తారు. 18, 10, 11 హోల్స్‌ ఆడిస్తారు. గెలిచేంత వరకు మళ్లీ మళ్లీ ఇవే హోల్స్‌ను ఆడిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని