Afghanistan Cricket: పాక్‌కు నిరాశ.. అఫ్గాన్‌తో సిరీస్‌ వాయిదా

అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లోనూ ఆ దేశ క్రికెట్‌ జట్టుతో మ్యాచ్‌లు ఆడాలని ఎదురుచూసిన పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. శ్రీలంక వేదికగా సెప్టెంబర్‌ 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగాల్సి ఉంది...

Updated : 24 Aug 2021 14:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లోనూ ఆ దేశ క్రికెట్‌ జట్టుతో మ్యాచ్‌లు ఆడాలని ఎదురుచూసిన పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. శ్రీలంక వేదికగా సెప్టెంబర్‌ 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగాల్సి ఉంది. అయితే, ఆ సిరీస్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తమ క్రికెటర్ల మానసిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ బోర్డు వివరించింది. ఇటీవల అఫ్గాన్‌ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అక్కడ ఒక్కసారిగా జనజీవనం స్తంభించి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. మరోవైపు కాబుల్‌ విమానాశ్రయంలోనూ పరిస్థితులు దయనీయంగా మారాయి.

అయితే, పాక్‌ బోర్డు ఇవేమీ పట్టించుకోకుండా నిన్నటివరకు అఫ్గాన్‌తో ఎలాగైనా సిరీస్‌ ఆడాలని చూసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు వర్చువల్‌గా సమావేశమై పాకిస్థాన్‌లో మూడు వన్డేల మ్యాచ్‌లు నిర్వహించాలని అంగీకరించాయి. కాగా, చివరికి అఫ్గాన్‌ బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకొని పాకిస్థాన్‌కు షాకిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ క్రికెటర్ల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ బోర్డు సీఈవో హమీద్‌ షిన్వారి పీటీఐకి చెప్పారు. మరోవైపు తాలిబన్ల పాలనలో ఆ దేశంలో క్రికెట్‌కు ఎలాంటి నష్టం జరగకూడదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఈ విషయంపై స్పందించిన పాక్‌ బోర్డు.. ఈ సిరీస్‌ జరగడానికి అఫ్గాన్‌తో తాము పూర్తిగా సహకరించామని, ఇరు జట్ల మధ్య ఈ ద్వైపాక్షిక సిరీస్‌ జరుగుతుందని ఆశించామని వివరించింది. ఇప్పుడు ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకు అంగీకరించామని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని